
క్యాష్ కోసం వెళ్తే.. మా పని ఎవరు చేస్తారు?
గువాహతి: పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఉద్యోగం, వారు చేసే వ్యాపారాలు, ఇతర పనులు వదిలేసి మరీ బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు పరుగులు పెడుతున్నా నగదు చేతికి అందక కొన్ని సందర్భాలలో నిరాశ తప్పడం లేదు. చేతిలో డబ్బులు అందుబాటులో లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అసోం రైతులు చెబుతున్నారు. రబీ సీజన్‌లో పంట అవసరాలకు ఖర్చులకు, విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపూర్వ అనే రైతు జాతీయ మీడియాకు తెలిపారు. సీజన్ సమయంలో డబ్బుల కోసం పొలాన్ని వదిలి వెళ్లడం రైతులకు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
'రోజుకు రెండు వేల రూపాయలు మాత్రమే ఏటీఎంలలో డ్రా చేసుకునే వీలు దొరుకుతోంది. కానీ తమ అవసరాలకు కనీసం 5వేల రూపాయలు చేతిలో ఉండాలి. సీజన్ ఇప్పటికే వచ్చేసింది. అయినా విత్తనాలు కొనేందుకు మా వద్ద డబ్బులు లేవు' ఏం చేయాలో అర్ధంకావడం లేదని సోనాపూర్ గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలం సాగు పనులను వదిలేసి బ్యాంకుల వద్దే సుదీర్ఘంగా ఉండాల్సి రావడం ఏమాత్రం శుభపరిణామం కాదని అపూర్వ అభిప్రాయపడ్డారు. తమ సమస్యలు అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అసోం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.