నాలుగురెట్లు డబ్బు రవాణా!
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలను తీర్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) చర్యలు ముమ్మరం చేసింది. జీతాలు చేతికందే సమయం కావడంతో నేటి నుంచి బ్యాంకులకు ప్రజలు పోటెత్తుతారన్న అంచనాతో నగదు రవాణాను నాలుగింతలు పెంచనుంది. రూ. 500 నోట్ల ముద్రణను వేగవంతం చేసింది.
రూ. 500 నోట్లను త్వరగా చెలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు ముద్రణాలయాల్లో ప్రింటింగ్ కొనసాగుతోంది. ఆర్బీఐ పరిధిలో ఉన్న మైసూరు, సాల్ బోనీ ముద్రణాలయాలతో పాటు ప్రభుత్వ పరిధిలోని నాసిక్, దేవాస్ ప్రింటింగ్ ప్రెసుల్లో సిబ్బంది నిర్విరామంగా నోట్లు ముద్రిస్తున్నారు. దీని కోసం రెండు షిప్టులను మూడు షిఫ్టులకు పెంచారు. ప్రధానంగా రూ.500 నోట్ల ముద్రిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లభ్యంకాక ప్రజలు అల్లాడుతున్నారు. నెలారంభం కావడంతో నేటి నుంచి నగదుకు మరింత డిమాండ్ పెరుగుతుందన్న అంచనాతో ఆర్బీఐ సన్నద్దమైందని, బ్యాంకులకు నగదు సరఫరాను నాలుగు రెట్లు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లుగా జీతాల నగదును ఏటీఏంల ద్వారా తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఏటీఏంలలో డబ్బు నింపేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించాయి. అయితే ఇప్పటికీ 90 శాతం బ్యాంకుల్లో నోక్యాష్ బోర్డులు దర్శనిమిస్తున్నట్టు సమచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.