పుణె: భూమాతా బ్రిగేడియర్ చీఫ్ తృప్తి దేశాయ్, ఆమె అనుచరులపై దాడి జరిగింది. ఇందులో ఒకరి తలకు తీవ్రంగా గాయమైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై కొందరు ఆందోళనకారులు నాశిక్ వద్ద నిన్న అర్ధరాత్రి దాడి చేశారు. తనను చంపడానికే దాడి జరిగిందని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన నాశిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాశిక్ లోని కపిలేశ్వర్ మందిర్ లోని గర్భ గృహలో పూజలు చేయడానికి ఆమె అనుచరులతో కలిసి నిన్నరాత్రి 11 గంటల ప్రాంతంలో వెళ్లారు. తృప్తి రాకను వ్యతిరేకిస్తూ అక్కడ గుమిగూడిన జనం నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆమె తన కారులో వేరే మార్గం ద్వారా తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై దాడి చేశారు.