![ఆయనే లేకపోతే ఏమయ్యేదో...](/styles/webp/s3/article_images/2017/09/3/61439538243_625x300.jpg.webp?itok=N54cTA1Z)
ఆయనే లేకపోతే ఏమయ్యేదో...
ముంబై: కారుతో సహా నీటిలో మునిగిపోతున్న ఓ వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు ముంబైకు సమీపంలోని ఓ దాబా యజమాని. ఈ మధ్యనే వివాహం చేసుకున్న ముంబైకి చెందిన కార్ల వ్యాపారి శేఖర్ తన భార్యను కలవడానికి గుజరాత్ వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పక్కనే ఉన్న ఆకాష్ దాబా యజమాని అతణ్ని రక్షించాడు. లేదంటే ఒక నవవధువు తన భర్తను కోల్పోయి ఉండేది వివరాల్లోకి వెళితే.
శేఖర్ (35) తన భార్యను కలవడానికి గుజరాత్ బయలుదేరాడు. అతను నడుపుతున్న కారు టైర్ అకస్మాత్తుగా పేలడంతో వాహనం అదుపు తప్పింది. బ్రిడ్జిపై నుంచి సుమారు 25 అడుగుల లోతున్న కాలవలోకి పడిపోయింది. చుట్టూ జనం పోగయ్యారు. మునిగిపోతున్న కారును జనం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. కానీ దాబా యజమాని మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకేశాడు. శేఖర్ను కొన ఊపిరితో బయటకు లాక్కొచ్చాడు.
వెంటనే జనం అతన్ని స్థానిక ఆసుప్రతిలో చేర్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న శేఖర్ బంధువులు..వెన్నెముక విరిగి, రెండు కాళ్లలో చలనంలేని స్థితి, మెదడులో రక్తస్రావం లాంటితీవ్ర గాయాలతో ఉన్న శేఖర్ ను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కెమ్ ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తస్రావాన్ని ఆపగలిగామని, ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు తెలిపారు. అతను సీటు బెల్టు పెట్టుకొని ఉండకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని కెమ్ డీన్ అవినాష్ సుపె తెలిపారు. ప్రస్తుతం శేఖర్ స్పృహలోనే ఉన్నాడని, ప్రాణాలకు ప్రమాదమేమీ లేదన్నారు.
అయితే తన భర్త రాక కోసం ఎదురు చూస్తున్న తాను ప్రమాద వార్త విని చాలా భయపడ్డానని , దాబా యజమాని కాపాడి ఉండకపోతే తన భర్త బతికే ఉండేవాడు కాదని బాధితుని భార్య ప్రియ అంటోంది. ఆయనకు జన్మజన్మలకు ఋణపడి ఉంటామని తెలిపింది. ఆయన అంత సాహసం చేసి ఉండక పోతే ఏమయ్యేదో అంటూ దాబా యజమానికి బంధువులు ధన్యవాదాలు తెలిపారు.