విమాన ఇంధనం.. డీజిల్ కన్నా చౌక!
- ఢిల్లీలో లీటరు డీజిల్ రూ. 51.52.. విమాన ఇంధనం రూ.46.51
న్యూఢిల్లీ: గతనెలలో పెట్రోలు ధర కంటే తక్కువైన విమాన ఇంధనం(జెట్ ఫ్యూయెల్) ధర ఆదివారం మరో 11.3 శాతం తగ్గి డీజిల్ కన్నా కూడా చౌక అయింది. ఢిల్లీలో ఏటీఎఫ్(విమాన టర్బైన్ ఇంధనం) ధర రూ.46.51కి తగ్గింది. ప్రస్తుతం అక్కడ డీజిల్ ధర రూ.51.52 వద్ద ఉంది.
ఢిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్ ధర రూ.5,909.9కి తగ్గింది. గత నెలలో తగ్గింపు వల్ల ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.52.42కు తగ్గింది. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర (రూ.58.91) కన్నా విమాన ఇంధన ధరే తక్కువైంది. సాధారణంగా ఏటీఎఫ్ కన్నా ఆటోమొబైల్ వాహనాలకు వాడే ఇంధనం నాణ్యత తక్కువగా ఉంటుంది. అందువల్ల ధర కూడా తక్కువగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన కంపెనీలకు ఈ తగ్గింపుతో ఊరట లభించనుంది.
నాన్‌సబ్సిడీ గ్యాస్‌పై రూ. 103 తగ్గింపు
అంతర్జాతీయంగా చమురు ధరలు ఆరేళ్లలోనే అతి తక్కువకు పడిపోవడంతో సబ్సిడీయేతర వంట గ్యాసు సిలిండర్‌పై కేంద్రం రూ.103.5 తగ్గించింది. అయితే, పెట్రోలు, డీజిల్ ధరల్లో మాత్రం మార్పు లేదు.