‘జల్లికట్టు’పై ఎవరిది రైటు?
న్యూఢిల్లీ: తమిళనాడులో జల్లికట్టును సమర్థిస్తున్నవారు ఇది తమ సంస్కతిలో భాగమని, జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను తాము ఆప్యాయంగా చూసుకుంటున్నామని చెబుతున్నారు. జల్లికట్టు పేరిట జంతువులను హింసిస్తున్నారని నిషేధాన్ని సమర్థిస్తున్న పెటా లాంటి సంస్థలు వాదిస్తున్నాయి. ఇందులో ఎవరి వాదన ఒప్పు, ఎవరి వాదన తప్పని చర్చిస్తున్న వారు కూడా లేకపోలేదు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న ప్రజలు మరో పక్క జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న పెటా సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
టెస్టోస్టెరోన్ వాడుతున్నారట...
ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆ హక్కు జల్లికట్టును సమర్థిస్తున్న ప్రజలకే కాకుండా, వ్యతిరేకిస్తున్న పెటా కార్యకర్తలకు కూడా ఉంటుంది. జల్లికట్టు ఆట వ్యవసాయ సంస్కృతి నుంచి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సంస్కతిని రక్షించుకోవడంలో ఎలాంటి తప్పులేదు. ఆ సంస్కృతి పేరిట వచ్చిన ఉపసంస్కృతిని మాత్రం వ్యతిరేకించాల్సిందే. జల్లికట్టు ఆటను రక్తి కట్టించేందుకు కొంత మంది ఎద్దులకు మద్యం తాగిస్తున్నారని, రక్తం కారేలా ఎద్దుల తోకను తెంపేస్తున్నారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆటలో జంతువులకన్నా మనుషులే ఎక్కువ గాయపడుతున్నారని అంటున్నవారు కూడా ఉన్నారు. ఎద్దులపై స్వారీ చేసి విజయం సాధించడం కోసం యువకులు ‘టెస్టోస్టెరోన్’ అనే లైంగిక హార్మోన్లను ఎక్కించుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి.
ఇదేమి సంస్కృతి?...
ఈ విపరీత పోకడలను ఉప సంస్కతి అంటాం. జల్లికట్టు ఆటను రక్తి కట్టించడం కోసం పెద్ద మొత్తాల్లో స్పాన్సర్‌షిప్‌లు రావడం, ప్రైజ్‌మనీ భారీగా పెట్టడం ఈ సంస్కతికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జంతు సంక్షేమ విభాగం మార్గదర్శకాల ప్రకారం జంతువుల ఆయురారోగ్యాలను చూసుకోవడం యజమానుల బాధ్యత. వాటిపై ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడరాదు. అంతేకాకుండా వాటిని భయానికి, మానసిక ఒత్తిడికి గురిచేయరాదు. జల్లికట్టు పోటీల్లోకి దించే ఎద్దులను వాటి యజమానులు ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవడమే కాదు. కన్నబిడ్డల్లా కూడా చూసుకుంటున్నారనడంలో సందేహం లేదు. కానీ జల్లికట్టు పోటీలు జరిగే పది రోజులు మాత్రం అవి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి.
వరి బీజాలను కత్తిరించడం హింస కాదా?
ఈ హింసను కూడా సహించలేమని భారత జాతీయ జంతువుల సంక్షేమ బోర్డు, పెటా లాంటి సంస్థలు వాదిస్తున్నాయి. సంతానం కలిగే అవకాశం లేకుండా ఎద్దులు, కుక్కల వరి బీజాలను నాటు పద్ధతిలో నలిపేయడాన్ని ఈ సంస్థలు ఎందుకు సమర్థిస్తున్నాయి. అది జంతువులను హింసించడం కిందకు రాదా? క్షీర విప్లవం పేరిట, డెయిరీల అభివద్ధి పేరిట ఆవులను, బర్రెలను పాలించే యంత్రాలుగా మార్చడం జీవ హింస కాదా? పాలను పీల్చే యంత్రాలు వాటి రక్తాన్ని పీల్చిన సందర్భాలు లేవా? జల్లికట్టును సమర్థిస్తున్నవారు, అటు వ్యతిరేకిస్తున్న వారు సగం సత్యమే మాట్లాడుతున్నారు.
మనలో హింసాత్మక ఆనందం...
వ్యవసాయ సంస్కృతిలో భాగంగా వచ్చిన జల్లికట్టును రక్తం చిందే ఆటగా మార్చిన ఉపసంస్కృతికి మనషుల్లో ఉండే హింసాత్మక ఆనందం అనే ప్రవత్తి కూడా కారణమే. తమిళ దక్షిణాదిలో విశేషాధరణగల జల్లికట్టుకు కుల వివక్షత కూడా ఎంతో ఉంది. ఈ ఆటలోకి దళితులను అనుమతించరు. జంతువులను హింసిస్తున్నారన్న కారణంగా కాకుండా మనలోని హింసాత్మక ఆనందానికి దారితీస్తున్నందున, మన మధ్య కుల వివక్షతను పెంచుతున్నందున ఈ జల్లికట్టును నిషేధించవచ్చు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సమస్యకైనా నిషేధం పరిష్కారం కాదు, కాకూడదు.
జల్లికట్టు సంస్కృతిని లేదా ఉప సంస్కృతిని ఇంత లోతుగా సుప్రీంకోర్టు కూడా పరిశీలించక పోవడం శోచనీయం. ఉప సంస్కతి నుంచి అసలు సంస్కతి పునరుద్ధరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా, 2009లో జల్లికట్టును క్రమబద్ధీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో సరైనా మార్గదర్శకాలు ఉన్నట్లయినా ఈ వివాదం ఇంతవరకు వచ్చేది కాదు. ‘నాన్ తమిళన్ దా, నాన్ తమిళాచి దా’ అంటూ జల్టికట్టుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న తమిళ సోదరులు, దుర్భర కరవు కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఇలాగే ముందుకు వస్తే అదే అప్పుడు అసలైన సంస్కృతి అవుతుంది.