జల్లికట్టు నిషేధంపై డీఎంకే నిరసన
చెన్నై : జల్లికట్టుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టుకు అనుమతి ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు నిన్న తేల్చి చెప్పడంతో రాష్ట్రమంతటా ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి. అయితే సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందేనంటూ డీఎంకే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నేతృత్వంలో కార్యకర్తలు ఈ రోజు ఉదయం చెన్నై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో కనిమొళి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ తమిళ సంప్రదాయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని అన్నారు.
జల్లికట్టుపై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాల్సిందేనంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద డీఎంకే కార్యకర్తలు నిరసన చేపట్టారు. మరోవైపు సుప్రీంకోర్టు నిషేధం విధించినా మధురైలో 22 ఎద్దులతో జల్లికట్టు కొనసాగుతోంది.