‘డిజిటల్ ఇండియా’ పథకం కింద దేశంలో వివిధ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), టెలికం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా రూ.69,524 కోట్లు ఖర్చు చేయనుంది.
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా’ పథకం కింద దేశంలో వివిధ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), టెలికం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా రూ.69,524 కోట్లు ఖర్చు చేయనుంది. సంబంధిత అధికారపత్రం ప్రకారం.. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కోసం గత యూపీఏ ప్రభుత్వం రూ.20 వేల కోట్లను కేటాయించగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.32 వేల కోట్లకు పెంచింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్(ఎన్‌ఓఎఫ్‌ఎన్) ప్రాజెక్టు గడువు తేదీని 2017 మార్చి నుంచి 2016 డిసెంబర్‌కు మార్చింది.
42,300 గ్రామాలకు మొబైల్ ఫోన్ కనెక్టివిటీ కోసం రూ.16 వేల కోట్లు, జాతీయ గ్రామీణ ఇంటర్నెట్ పథకం కింద 2.5 లక్షల గ్రామాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీకి ఉమ్మడి సేవా కేంద్రాల ఏర్పాటు కోసం రూ. 4,750 కోట్లు కేటాయించింది. రూ.15,686 కోట్లతో నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని, వచ్చే ఏడాదికల్లా రూ. 790 కోట్లతో అన్ని వర్సిటీల్లో వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. కోటి మంది విద్యార్థులకు ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు శిక్షణ ఇప్పించడానికి రూ. 200 కోట్లు కేటాయించింది.