పోలీసుల ఎదుట దినకరన్
- ఈసీకి లంచమిచ్చారనే ఆరోపణలపై విచారణ
- మధ్యవర్తి సుకేశ్ సమక్షంలో ప్రశ్నల వర్షం
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. చాణక్యపురి అంతర్రాష్ట్ర సెల్ ఆఫీస్‌లో పటిష్టమైన భద్రత నడుమ ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దినకరన్‌ను విచారించారు. ‘ఈ కేసుకు సంబంధించి మధ్యవర్తి సుకేశ్‌తో దినకరన్‌కు సంబంధం, దినకరన్ ఎన్నికల కమిషన్ అధికారిని కలిశారా లేదా అనే అంశాలపై ప్రశ్నించాం. ఇద్దరినీ విడివిడిగా, ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాం’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
అయితే ఈ విచారణ సందర్భంగా దినకరన్ లాయర్లను పోలీసులు లోపలకు అనుమతించలేదు. జయలలిత హఠాన్మరణంతో చీలిన అన్నాడీఎంకేలో పార్టీ గుర్తుపై రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నిక విషయంలో అన్నాడీఎంకే విజయానికి ఆయువు పట్టైన రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ గుర్తును పొందేందుకు అత్యున్నత స్థాయి వ్యక్తులు, అధికారులతో పరిచయాలు ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్న సుకేష్ అనే మధ్యవర్తి ద్వారా ఈసీకి రూ.50 కోట్లు ఎరవేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ ప్రయత్నం వికటించి రూ.1.30 కోట్లతో సుకేష్ ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడు. తనపై వచ్చిన ఆరోపణలను దినకరన్ ఖండిస్తూ వచ్చారు. తనెప్పుడూ సుకేశ్‌ను కలవలేదన్నారు. కానీ, సుకేశ్‌ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దినకరన్‌కు సమన్లు జారీచేసి శనివారం ఢిల్లీ పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించారు.