ఇంటికి వెళ్లగానే దీపా కర్మాకర్ ఏం చేసింది?
రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం శాయశక్తులా కృషి చేసి, వెంట్రుక వాసిలో అదృష్టాన్ని మిస్సయిన దీపా కర్మాకర్.. ఇంటికి రాగానే పుస్తకాలు తీసింది. ఇంటికి వచ్చిన మర్నాటి నుంచే ఆమెకు ఎంఏ పరీక్షలు ఉన్నాయి. త్రిపుర యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఆమె ఎంఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరైంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తనకు త్వరలోనే వస్తుందని ఆమె గట్టి నమ్మకంతో చెప్పింది. ఒకవైపు క్రీడాంశాలపై అపారమైన ఆసక్తి చూపుతూనే, చదువు మీద కూడా ఇంత శ్రద్ధ పెట్టడం అద్భుతమని త్రిపుర యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. సాధారణంగా క్రీడాకారులు చదువును పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో వీలైనప్పుడు పరీక్షలు రాస్తారు. కానీ, దీప మాత్రం అలా కాకుండా అకుంఠిత దీక్షతో రియో నుంచి వచ్చిన మర్నాడే పరీక్షలకు హాజరైంది.. బాగా రాసింది కూడానట. పరీక్షలు తప్పించుకోడానికి వంకలు వెతికే పిల్లలు ఆమెను చూసి నేర్చుకోవాలని అధ్యాపకులు అంటున్ నారు.
జిమ్నాస్టిక్స్ కోచింగ్, ప్రాక్టీసుకు చాలా సమయం పడుతుందని, అయినా దీప మాత్రం ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. చివరకు రియోకు వెళ్లేటప్పుడు కూడా ఆమె పుస్తకాలు తీసుకెళ్లిందట. మధ్యలో ఖాళీ దొరికితే చదువుకుందామని అలా తీసుకెళ్లిందని ఆమె తల్లి గౌరి చెప్పారు. మన దేశంలో చదువా.. ఆటలా అని ఏదో ఒకటి ఎంచుకోమంటారని, కానీ రెండూ ఒకేసారి చేయొచ్చని దీపా కర్మాకర్ నిరూపించిందని ఆమెతో పాటు పరీక్షకు హాజరైన యువకుడు చెప్పాడు.