సాక్షి, న్యూఢిల్లీ : 1971లో పాక్, భారత్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా ఎం. బవేజా నాయకత్వంలో భారత సైనిక దళం, పాకిస్థాన్ ఆక్రమించుకున్న జమ్మూ కశ్మీర్‌లోని లడక్ శిబిరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకుంది. ఇందుకుగాను ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు లభించింది. అయితే ఈ ఆపరేషన్‌లో ఆయన కాలి వేళ్లను కోల్పోయారు. 2000 సంవత్సరంలో బ్రిగేడియర్‌గా సైన్యం నుంచి రిటైరైన బవేజాకు ప్రస్తుతం 75 ఏళ్లు. ఆయనకు 1971లో అప్పగించిన మిషన్‌ను పూర్తి చేయడానికి కనీసం పది రోజులు కూడా పట్టలేదు. అయితే అంగ వైకల్య పింఛను సాధించేందుకు ఆయనకు 10 ఏళ్లు పట్టింది.
పింఛను కోసం కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగిన ఆయన కొత్తగా ఏర్పాటయిన సాయుధ దళాల ట్రిబ్యునల్‌ను 2007లో ఆశ్రయించారు. 2010లో ట్రిబ్యునల్ అంగ వైకల్య పింఛను మంజూరు చేసింది. పింఛను కూడా తీసుకుంటున్నారు. అయితే అంతటితో ఆయన పింఛను కష్టాలు తీరలేదు. 2015లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పింఛను ఆగిపోయింది. 2016లో సుప్రీం కోర్టు ప్రభుత్వం అప్పీల్ కొట్టి వేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రిబ్యునల్ ఓకే చేసిన అంగవైకల్య పింఛన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాదాపు 800 అప్పీళ్లను దాఖలు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో సుప్రీం కోర్టు అంతకుముందు ప్రభుత్వం దాఖలు చేసిన వాటితో సహా దాదాపు వెయ్యి అప్పీళ్లను కొట్టి వేసింది. ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి.
ద్వంద్వ ప్రమాణాలంటే ఇదే మరి
సైనికుల అంగవైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను ఉపసంహరించుకోవాలని, కొత్తగా అప్పీళ్లకు వెళ్లరాదంటూ 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి బీజేపీ ఉపాధ్యక్షులు స్మృతి ఇరానీ యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాల ట్రిబ్యునల్ సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రభుత్వం నుంచి అప్పీళ్లు లేకుండా సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. అందుకు కట్టుబడి ఉండకుండా 2017 వరకు అప్పీళ్లు దాఖలు చేస్తూనే వచ్చింది.
2015లో ఉన్నతస్థాయి కమిటీ
సైనిక దళాల సమస్యలు, పింఛను వ్యవహారాల పరిష్కారం కోసం 2015లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ రిటైరైన ఉన్నత సైనికాధికారులతో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ 75 సిఫార్సులు చేయగా, అందులో 32 సిఫార్సులను ఆమోదించినట్లు పర్రీకర్ ప్రకటించారు. సైనిక అంగ వైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అప్పీళ్లును ఉపసంహరించుకోవడం, కొత్తవి దాఖలు చేయక పోవడం వాటిలో ముఖ్యమైనది. అయినా 2017, జూన్ వరకు అప్పీళ్లు దాఖలవుతూ వచ్చాయి. ఇక అప్పీళ్లను నిలిపి వేస్తున్నట్లు 2017, జూన్ 29వ తేదీతో ‘కేంద్ర సైనిక పింఛనుదారుల సంక్షేమ సంఘం’కు కేంద్ర రక్షణ శాఖ ఓ లేఖ రాసింది. అప్పటి నుంచి కొత్తగా అప్పీళ్లను దాఖలు చేయలేదు. కానీ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లలో ఒక్కదాన్ని కూడా ఉపసంహరించుకోలేదు. వాటిని ఉపసంహరించుకునే ఆలోచన కూడా తమకు లేదని ఈ ఏడాది జనవరి నెలలో ఇప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అప్పీళ్లను కొట్టివేసినా పింఛన్లు హుళక్కే
సుప్రీం కోర్టు 2015లో పది అప్పీళ్లను కొట్టివేయగా వాటిలో ఇద్దరు సైనికులకు నేటికి పింఛను అందడం లేదు. వారిలో 53 ఏళ్ల లీలా సింగ్ ఒకరు. పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన లీలా సింగ్ 2002లో నాయక్‌గా రిటైర్ అయ్యారు. ఆయన 1994లో ఊరి నుంచి తిరిగివస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఆయనది పాక్షిక అంగవైకల్యంగా గుర్తించిన సైనిక అధికారులు అయనకు అందుకు తగిన విధులనే అప్పగించారు. రిటైరయిన తర్వాత ఆయన అంగవైకల్య పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా విధుల నిర్వహణలో గాయపడ్డ వారికి మాత్రమే పింఛను వర్తిస్తుందన్న కారణంగా కేంద్రం తిరస్కరించింది. ఆయన 2008లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి విజయం సాధించారు. దాన్ని మళ్లీ కేంద్రం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా, 2015లో కొట్టివేసింది. అయినప్పటికీ ఆయనకు ఇప్పటికీ పింఛను రావడం లేదు.
2007లోనే ట్రిబ్యునల్ ఏర్పాటు
సైనిక సిబ్బందికి సంబంధించిన కేసుల పరిష్కారం కోసం దిగువ కోర్టుల నుంచి హైకోర్టులు, సుప్రీం కోర్టుల వరకు వెళ్లడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందన్న కారణంగా ‘సాయుధ దళాల ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేయాలని 1999లో కేంద్రం నిర్ణయించింది. అయితే 2007లో అమల్లోకి వచ్చింది.
దేశభక్తి బోగస్... అంతా రాజకీయమే!
‘భారత మాతా కీ జై, జై జవాన్ అంతా హంబక్. జాతీయ గీతం పాడితే నిలబడడం అంతా ఓ నటన. గత ప్రభుత్వాలకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. మమ్మల్ని నిజంగా పట్టించుకుంటున్న వారు ఎవరూ లేరు. ప్రస్తుత ప్రభుత్వానిది పూర్తిగా రాజకీయం’ అని ‘మాజీ సైనికుల ఫిర్యాదుల విభాగం అధ్యక్షుడు రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఎస్‌ఎస్ సోహి వ్యాఖ్యానించారు. ‘ఈ మోదీ ప్రభుత్వం జాతీయవాదం గురించి ఉద్బోధ చేస్తోంది. అంగవైకల్య సైనికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సాయుధ దళాల వ్యతిరేక వైఖరే కాకుండా జాతీయవాదానికి కూడా వ్యతిరేకం’ అని ‘మాజీ సైనికుల ఐక్య ఫ్రంట్’ ప్రధాన కార్యదర్శి రిటైర్ట్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ దినేశ్ నైన్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment