‘మనీల్యాండరింగ్’ కిందకు రాదు!
మారన్ సోదరుల కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో మారన్ సోదరులకు ప్రత్యేక న్యాయస్థానం విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ, సీబీఐ తరఫున ఈ కేసును వాదించడానికి నియమితులైన ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్‌పీపీ) ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దయానిధి మారన్ , కళానిధి మారన్ లకు బెయిల్ మంజూరు చేయడం, ఈ కేసుకు సంబంధించి జప్తు చేసిన రూ. 742 కోట్లను విడుదల చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అయితే ఈ కేసులో మనీల్యాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీలేవని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
‘‘ఈ కేసులో జప్తు చేసిన రూ. 742 కోట్లు నేర సంబంధిత ఆదాయం కిందకు రాదు. అందువల్ల మనీల్యాండరింగ్ ఏ మాత్రం కాదు’’ అని స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ లో అనేక లోపాలున్నాయని తెలిపింది. లోపాలను సరిచేసుకొని సరైన పిటిషన్ తో రావడానికి ఆనంద్ గ్రోవర్‌కు బుధవారం(8వ తేదీ) వరకు సమయమిచ్చింది. కేసు తీవ్రత దృష్ట్యా మారన్ సోదరులకు బెయిల్ మంజూరు చేయకూడదని, జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయకూడదనే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ కోసం ఎదురు చూడకుండా తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు గ్రోవర్ కోర్టుకు తెలిపారు.