398 స్కూళ్లలో ప్రవేశాలే లేవా? | Do not have entries in 398 schools? | Sakshi
Sakshi News home page

398 స్కూళ్లలో ప్రవేశాలే లేవా?

Published Wed, Apr 13 2016 12:31 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

398 స్కూళ్లలో ప్రవేశాలే లేవా? - Sakshi

398 స్కూళ్లలో ప్రవేశాలే లేవా?

ఒక్క అడ్మిషన్ కూడా నమోదవకపోవడంపై సుప్రీం ఆశ్చర్యం
♦ కారణాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని అమికస్ క్యూరీకి ఆదేశం
♦ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
♦ పిల్లలు స్కూళ్లకు వచ్చేలా అధికార యంత్రాంగం ప్రోత్సహించడం లేదు
♦ విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని శరీరాల వంటివని వ్యాఖ్య
♦ టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వ న్యాయవాది
♦ చర్యలు ముఖ్యం కాదు.. ఫలితాలెలా ఉన్నాయన్నదే ప్రధానమన్న కోర్టు
 
 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఒక్క ప్రవేశం కూడా నమోదు కాకపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని శరీరాల వంటివని వ్యాఖ్యానించింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు నమోదు కాకపోవడానికి కారణాలను తెలుసుకుని నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ అమికస్ క్యూరీకి నిర్దేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం లోపించిందని దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

స్కూళ్లలో మౌలిక వసతులు లేవని, బోధన ప్రమాణాలు పడిపోయాయని, పరిస్థితిని చక్కదిద్దాలంటూ తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జె.సాగర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తొలుత తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని వివరాలను ఈ కేసులో ఇదివరకే నియమితులైన అమికస్ క్యూరీ అశోక్ గుప్తా కోర్టు ముందుంచారు. 398 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలే లేవని అఫిడవిట్‌లో పేర్కొన్న సంగతిని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రవేశాలు లేని పాఠశాలల్ని మూసివేసే పరిస్థితి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ దీపక్ మిశ్రా జోక్యం చేసుకుంటూ... ‘‘398 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం ఏంటి? విద్యార్థుల్లేని పాఠశాల జీవం లేని శరీరం వంటిది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే కదా?..’’ అని అన్నారు.
 
 స్కూళ్లు మూసివేసే ఉద్దేశం లేదు: ప్రభుత్వ న్యాయవాది
 తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథ శెట్టి వాదనలు వినిపిస్తూ... రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూన్ 30 నాటికి ఖాళీలు భర్తీ చేస్తామని వివరించారు. పాఠశాలలు మూసివేసే ఉద్దేశం తమకు లేదని విన్నవించారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని చెప్పారు. అయితే ఆయన వాదనతో జస్టిస్ దీపక్ మిశ్రా విభేదించారు. తన గ్రామంలో ఇప్పటివరకు ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పిల్లలు పాఠశాలలకు వచ్చేలా అధికార యంత్రాంగం ప్రోత్సహించడం లేదంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముఖ్యం కాదని, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయన్నదే ప్రధానమని పేర్కొంది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ అశోక్ గుప్తా... ప్రైవేటు పాఠశాలల్లో మూడేళ్లకే ప్రవేశాలు కల్పిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లకు కల్పిస్తున్నారని, ప్రభుత్వం చెబుతున్న అంశాల్లో ఇది కూడా ఒకటని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్న సాకుతో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని, పిల్లలు పాఠశాలలకు వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని, 398 పాఠశాలల్లో ఒక్క ప్రవేశం కూడా ఎందుకు నమోదు కాలేదో కోర్టుకు తెలియచేయాలని అమికస్ క్యూరీకి సూచించారు. అమికస్ క్యూరీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయవాదుల కమిషన్ రాష్ట్రంలో పర్యటించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సాగర్‌రావు, న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ కూడా ఈ క్షేత్రస్థాయి విచారణలో సహకరించాలని సూచించింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement