ఆటంక రాజకీయాలు వద్దు
ప్రభుత్వానికి సహకరించాలి: రాజ్యసభలో జైట్లీ
ఏ విద్యార్థి మీదా సర్కారుకు వ్యతిరేకత లేదు
న్యూఢిల్లీ: కీలకమైన బిల్లులు రాజ్యసభలో నిలిచిపోయి ఉన్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు ఆటంక రాజకీయాలను విడనాడి ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో.. జేఎన్‌యూ, అసహనం, ద్రవ్యోల్బణం, విదేశాంగ విధానం అంశాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో జైట్లీ మాట్లాడారు. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి కన్హయ్యకుమార్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వానికి ప్రత్యేకించి ఏ విద్యార్థి మీదా వ్యతిరేకత లేదని, అయితే వాక్‌స్వాతంత్య్రం కింద దేశ విభజన ప్రచారానికి అనుమతించబోమన్నారు. ‘వీరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వంటి ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ముందు వరుసలో ఉంటాయని ఆశిస్తున్నా.
ఇటువంటి వారికి గౌరవయోగ్యతను ఇచ్చే పనులు చేయకండి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు సంబంధించి యూపీఏ ప్రభుత్వం సాధించిన ప్రయోజనాలను ఎన్‌డీఏ సర్కారు కాలరాస్తోందన్న రాహుల్ విమర్శలను తిప్పికొడుతూ.. ‘దేశంలో జరిగిన దాడి వారి దేశం నుంచే జరిగిందని తొలిసారి ఒప్పుకునేలా మేం ఒత్తిడితెస్తున్నాం’ అని పేర్కొన్నారు. చమురు ధరల తగ్గుదల ప్రయోజనాల్లో సింహభాగం ప్రజలకే బదిలీ చేస్తున్నామని, నష్టాల్లో ఉన్న చమురు సంస్థలకు కొంత భాగం అందిస్తూ.. ఇంకొంత భాగాన్ని పల్లెల్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి పెట్టుబడి పెడుతున్నామన్నారు. ఇష్రాత్‌జహాన్ కేసు విషయాన్ని లేవనెత్తుతూ.. నాటి గుజరాత్ సీఎం మోదీని ఇరికించేందుకు కాంగ్రెస్ నిందితులతో కుమ్మక్కయిందని ఆరోపించారు. నల్లధన వెల్లడికి తెచ్చిన పథకంపై రాహుల్ విమర్శలను తిప్పికొడుతూ.. 1997లో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన పథకాన్ని ప్రస్తావించారు. అందులో.. నల్లధనం వెల్లడిస్తే ఎటువంటి జరిమానా లేదన్న విషయాన్ని గుర్తుచేశారు.
కన్హయ్యకు భద్రత కల్పించాలి: ఆజాద్
జేఎన్‌యూఎస్‌యూ చీఫ్ కన్హయ్య ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో.. ఆయనకు భద్రత కల్పించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. తగినంత భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కాగా, దేశ శత్రువుల (పాక్ జాతీయుల పేరిట ఉన్న) ఆస్తులను సంరక్షుడి (కేంద్ర ప్రభుత్వం) ఆధ్వర్యంలో కొనసాగించేందుకు శత్రువుల ఆస్తి చట్ట సవరణ బిల్లు-2016ను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.