మోదీ’ ఏడాది పాలనపై తీవ్ర విమర్శలతో కాంగ్రెస్ ‘రిపోర్ట్ కార్డ్’
బెంగళూరు/ముంబై: ప్రధాని నరేంద్రమోదీ చూపుకోవటానికి క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఏదీ లేదని, ఏకవ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజాస్వామిక సంస్థలను హత్య చేస్తున్నారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మోదీ సర్కారు ఏడాది పాలనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఐదు అధ్యాయాలతో శనివారం ఒక రిపోర్ట్ కార్డును వెలువరించింది. కాంగ్రెస్ నేతలు ఎ.కె.ఆంటోని ఢిల్లీలో, జైరాం రమేష్ బెంగళూరులో, కపిల్ సిబల్ ముంబైలో, సి.పి.జోషి రాయ్‌పూర్‌లో మోదీ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ (ఆంగ్ల అక్షరాలు ఎంఓడీఐ) అంటే.. ‘మర్డర్ ఆఫ్ డెమొక్రటిక్ ఇండియా (ప్రజాస్వామ్య భారతదేశం హత్య)’ అని.. అది పార్లమెంట్‌ను విస్మరించిందని జైరాం అభివర్ణించారు.
‘ఈ సర్కారు అత్యధిక పాలన అనేది అత్యధిక దురహంకారంగా మారింది. అతితక్కువ ప్రభుత్వం అనేది ఏక వ్యక్తి ప్రభుత్వంగా మారింది’ అని అన్నారు. మోదీని ‘సూపర్ గగన విహారి’ అని అంటూ.. ఆయన తన అంతర్జాతీయ ప్రతిష్ట మెరుగుపెట్టుకోవటంలోనే తలమునకలయ్యారన్నారు. యూపీఏ పథకాలను తిరిగి కొత్త రూపంలో ప్రవేశపెట్టటం, సామాజిక పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గించటం అంశాలపై కాంగ్రెస్ రిపోర్టు కార్డులో విమర్శించింది.
‘ప్రధాని’ ప్రతిష్ట నిలబెట్టాం: జైట్లీ
న్యూఢిల్లీ: గత యూపీఏ సర్కారు హయాంలో కాంగ్రెస్ రెండు అధికార కేంద్రాలు నడిపిందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని, ప్రతిష్టను తిరిగి నిలబెట్టామని అన్నారు. యూపీఏ హయాంలో ప్రధాని మాట ఏమాత్రం చెల్లుబాటయ్యేది కాదని, ప్రభుత్వం అవతల కాంగ్రెస్ మరో అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని పదవికి ఉన్న ప్రతిష్టను దిగజార్చిందని ధ్వజమెత్తారు.
కేంద్రంలో మోదీ సర్కారు వచ్చి ఏడాదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారుకు ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ 200 భారీ ర్యాలీలు, ఐదువేల బహిరంగ సభలను నిర్వహించనుంది. తొలి ర్యాలీని ఈ నెల 25న యూపీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్వగ్రామంలో నిర్వహిస్తారని, ప్రధాని మోదీ ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తెలిపారు.
‘మర్డర్ ఆఫ్ డెమొక్రటిక్ ఇండియా’
Published Sun, May 24 2015 2:30 AM | Last Updated on Mon, Aug 20 2018 5:17 PM
Advertisement