
వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు
బూర్ద్వాన్(పశ్చిమబెంగాల్):ఓ వైద్య విద్యార్థినిపై కాంట్రాక్ట్ వర్కర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బూర్ద్వాన్ వైద్య కళాశాలలో వెలుగుచూసింది. అత్యవసర విధుల్లో భాగంగా గత రాత్రి డాక్టర్ల విశ్రాంతి గదిలో ఉన్న వైద్య విద్యార్థినిపై అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రసూన్ నాయక్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు లైంగిక చర్యలకు దిగాడు. అయితే అదే సమయంలో విధుల్లో ఉన్న మరో వైద్య విద్యార్థిని విషయాన్ని గమనించి, ఆస్పత్రిలో ఉన్న అలారంతో అక్కడ ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో అక్కడకు చేరుకున్న ఆస్పత్రి సిబ్బంది నాయక్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉత్పల్ డాన్ మాట్లాడుతూ.. అతనిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ముందుగా ఓ క్షమాపణ పత్రం రాయించుకుని.. అనంతరం అతన్నిపోలీసులకు అప్పగించినట్ల పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అతనికి గట్టి శిక్ష పడేందుకు ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకుని మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.