
టపాసులకు కుక్కలు భయపడుతాయా?
న్యూఢిల్లీ: ఓ మనిషికి సాలె పరుగులంటే భయమనుకుందాం. సాలె పురుగులు గూళ్లు కట్టుకున్న ఓ గదిలోకి ఆ మనిషిని పంపించి తలుపులు మూసేశాం అనుకోండి. ఆ మనిషికి కదల్లేని స్థితి కూడా ఉందనుకోండి. అప్పుడు ఆ మనిషికి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి? దీపావళి టపాసులకు భయపడే కుక్కలకు ఏసీపి డ్రగ్ (అసెపోమజైన్)ను ఇచ్చినట్లయితే వాటి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంటుంది. బాణాసంచా పేలుళ్లకు 45 శాతం కుక్కలు తీవ్రంగా భయపడుతాయి. ఆ శబ్దాలకు భయపడి గోలగోల చేస్తాయి. ఇల్లుపీకి పందిరేస్తాయి. ఆ బాధ నుంచి వాటిని తప్పించేందుకు జంతు వైద్యుల వద్దకెళితే వారు సాధారణంగా అసెపోజైన్ అనే మత్తు మందును సూచిస్తారు.
ఆ మందును కుక్కలకు ఇవ్వడం వల్ల వాటి వినికిడి జ్ఞానం మరింత పెరుగుతుంది. అదే సమయంలో శరీరం మొద్దుబారిపోయి కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. బాణాసంచా పేలుళ్ల శబ్దాలు మరీ ఎక్కువగా వినిపించడం వల్ల అవి మానసికంగా అంతకుముందుకన్నా ఎక్కువగా ఆందోళన చెందుతాయి. ఆ శబ్దాలను దూరంగా పారిపోవాలనుకుంటాయి. అందుకు కాళ్లు, శరీరం సహకరించవు. కదలకుండా ఉండిపోతుంది. వాటిని చూసే యజమానులకు అవి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాయి. బాణాసంచా పేలుళ్లకు భయపడకుండా ఉండేందుకు ‘డెక్సిమెడెటోమిడైన్’ అని మందును ఇవ్వాలంటూ ఇటీవల టీవీల్లో యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ మందు వల్ల వాటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఇంగ్లండ్‌లోని నట్టింగమ్ ట్రెంట్ యూనివర్శిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా పేలుళ్ల భయాందోళనల నుంచి పెంపుడు కుక్కలను రక్షించాలంటే ఏం చేయాలి? ఏ ప్రాంతంలో ఉంటే తన సురక్షితంగా ఉంటుందని ఆ కుక్క భావిస్తుందో అక్కడే దాన్ని ఉంచాలి. కుక్కకు ఓ ప్రత్యేక డెన్ ఉండి, చీకటి పడకముందే అ డెన్‌లోకి వెళ్లే అలవాటు ఉంటే అందులోకి తీసుకెళ్లాలి. యజమాని దగ్గరుంటేనే సురక్షితంగా ఉంటుందనుకుంటే ఆ యజమాని దగ్గరుంచాలి లేదా ఇంట్లోకి శబ్దం ఎక్కువ రాని గదిలో ఉంచి, తలుపులు, కిటికీలు మూసెయ్యాలి. వీలయితే మ్యూజిక్, లేదా టీవీ కార్యక్రమాలు బాణాసంచా పేలుళ్లు వినిపించని స్థాయిలో పెట్టాలి.
వీటన్నింటికన్నా ఉత్తమమైన మార్గం కుక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాటికి బాణాసంచా పేలుళ్ల శబ్దాలను క్రమంగా అలవాటు చేయాలి. అంటే దీపావళి పండుగకు రోడ్లపైకి తీసుకెళ్లడం కాదు. సీడీలు లేదా యూట్యూబ్ ద్వారా బాణాసంచా పేలుడు శబ్దాలను చిన్న స్థాయిలో వినిపిస్తూ క్రమంగా వ్యాల్యూమ్ పెంచుతూ పోతూ వాటికి అలవాటు చేయాలి. కొన్ని రోజుల్లోనే అవి ఆ సబ్దాలకు అలవాటు పడతాయి.