‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’
బెంగళూరు: కర్ణాటక ప్రజలు సంయమనం పాటించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర విజ్ఞప్తి చేశారు. కొన్ని సంస్థల పేరుతో కొంత మంది వ్యక్తులు హింసకు పాల్పడ్డారని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
హింసకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులను వెంటనే అదుపులోకి తెచ్చామని, లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేదని పరమేశ్వర అన్నారు. పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుతో కావేరి నీటి వివాదం నేపథ్యంలో బెంగళూరు సహా కర్ణాటకలో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలు హింసకు దారి తీశాయి.