కేంద్రానికి నితీశ్ ఘాటు లేఖ
పట్నా: కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటు పదాలతో లేఖ రాశారు. నలంద విశ్వవిద్యాలయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని, దాని నిబంధనల్లో మార్పులు చేయవద్దని అన్నారు. అలా చేయడమంటే వర్సిటీకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తగ్గించడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. వర్సిటీలోని పాలక కమిటీ విషయంలో తనను సంప్రదించకుండానే మార్పులు చేశారని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుందని పేర్కొంటూ వైస్ ఛాన్సలర్ జార్జ్ యో తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు నితీశ్ లేఖ రాశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో వర్సిటీ వీసీని కచ్చితంగా సంప్రదించాలని, కానీ అలా జరగలేదని, ఈ చర్య వర్సిటీ స్వతంత్ర ప్రతిపత్తి హోదాను సంకటంలో పడేసే పరిస్థితి అని అందులో ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోకూడదని, దీని వెనుక ప్రధాని నరేంద్రమోదీ హస్తం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటివి జరగకుండా చూడాలంటూ నితీశ్ విజ్ఞప్తి చేశారు.