భారత్పై దాడికి ఐఎస్ కుట్ర?
ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరి.. స్వదేశానికి తిరిగొచ్చిన ముంబై యువకుడు అరీబ్ మజీద్ను అరెస్టు చేసి, ఎనిమిది రోజులు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారు. కొన్నాళ్ల పాటు ఇస్లామిక్ స్టేట్ సంస్థ తరఫున ఉగ్రవాదంలో పాల్గొన్న తర్వాత మజీద్ తిరిగి రాగానే అతడిని అరెస్టు చేశారు. అతడిని ఎన్ఐఏతో పాటు మహారాష్ట్ర ఏటీఎస్ కూడా విచారిస్తోంది. అతడి సహచరుల గురించిన మరిన్ని వివరాలు ఎన్ఐఏకు అందుతున్నాయి. మజీద్ బాగా తీవ్ర భావాలతో ఉన్నాడని, ఇస్లామిక్ స్టేట్లో ఉండగా తాను చేసిన పనులకు ఏ మాత్రం బాధపడటం లేదని ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. అసలు ఇస్లామిక్ స్టేట్ నుంచి అతడు తిరిగి రావడం వెనక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఎన్ఐఏ, మహారాష్ట్ర ఏటీఎస్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. భారతదేశంలో ఆ ఉగ్రవాద సంస్థ తరఫున ఏమైనా ఆపరేషన్లు చేపట్టడానికి వచ్చాడేమోనని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అన్ని కోణాల్లోనూ ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భారతదేశంపై ఐఎస్ ప్రభావం కొంత ఆందోళన కలిగించేదేనని గువాహటి పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అన్నారు. అయిఏత, మన భద్రతా దళాలు ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.