తాగి నడిపేవారిపై ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: మద్యం సేవించి వాహనం నడిపే వారిని కళ్లముందు తిరిగి మానవ బాంబులుగా ఢిల్లీ కోర్టు అభివర్ణించింది. వీరు ప్రజానీకానికి చాలా అపాయకరమని ఆందోళన వ్యక్తం చేసింది. తాగి కారును నడిపిన వ్యక్తికి ఆరు రోజులపాటు జైలుకు పంపిస్తూ తీర్పు చెప్పిన సందర్భంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. బాదర్పూర్ అనే ప్రాంతానికి చెందిన జోగి వర్గిస్ అనే వ్యక్తి తాగి కారు నడిపిన కారణంగా కింది స్థాయి కోర్టు ఆరు రోజుల జైలు శిక్షను, రూ.2000 ఫైన్ వేసింది.
అయితే, దీనిని సవాల్ చేస్తూ వర్గిస్ ఢిల్లీ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు జడ్జి లోకేశ్ కుమార్ శర్మ కిందిస్థాయి కోర్టును సమర్థించారు. తాగి డ్రైవింగ్ చేసేవారు సమాజానికి ప్రమాదకరమని, వారు కళ్లమందు కనిపించే మానవబాంబుల్లాంటివారని వ్యాఖ్యానించారు. 'నా ఉద్దేశంలో మితిమీరిన మద్యం సేవించి రెండు చక్రాల వాహనం, ఇతర వాహనంగానీ నడిపే వారు సూసైడ్ హ్యూమన్ బాంబర్సే' అని అన్నారు.