కలలో కూడా కొడుకు సూసైడ్ వీడియోనే..!
న్యూఢిల్లీ: ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) కు చెందిన ఓ డ్రైవర్ తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు తన తండ్రికి వాట్సా ప్ లో వీడియో షేర్ చేశాడు. గంట తర్వాత వీడియో చూసిన తండ్రి, కుటుంబసభ్యులు వెళ్లి చూసేలోగా ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని బిందాపూర్ లో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. 36 ఏళ్ల సంజయ్ వర్మ డీటీసీలో డ్రైవర్ గా చేస‍్తున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రి మోహర్ సింగ్ ఫోన్ కు మెసేజ్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మీ ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుని చెక్ చేసుకోండి అని మరో సందేశం పంపాడు.
వాట్సాప్ ఇన్ స్టాల్ చేసి తండ్రి నిద్రపోయాడు. గంట తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి అందులో ఏదో వీడియో ఉంది. ఏంటా అని గమనిస్తే తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపే వీడియో అది. నన్ను క్షమించండీ నాన్నా. నా పిల్లలకు 14, 9 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. మీరు వాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఆలనాపాలనా చూసి వారికి న్యాయం చేయాలి. కొందరు సన్నిహితులే నా ఈ చర్యకు కారణం. ఈ వీడియోని మీ వద్ద రికార్డుగా భద్రపరుచుకోండి’ అని సంజయ్ వర్మ పంపిన వీడియోలో ఉంది.
పోలీసులకు వీడియో చూపించి ఫిర్యాదు చేసి 50 రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయడం లేదని వర్మ తండ్రి మోహర్ సింగ్ వాపోతున్నాడు. అది ఆత్మహత్య కేసు అని చెప్పిన పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారు. కానీ నా కొడుకు మాటలు చూస్తే.. ఇది హత్య అని కచ్చితంగా చెప్పవచ్చు అన్నారు. నా కొడుకు నాపై పెట్టిన బాధ్యత ప్రతిరోజూ కలలో గుర్తుకొస్తుందని, వర్మ మాటలు తనను బాధిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశాడు.