ముంబై చేరుకున్న ‘భారీ మహిళ’
క్రేన్ సాయంతో విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి తరలింపు
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక బరువున్న మహిళల్లో ఒకరైన ఈజిప్ట్ కు చెందిన ఎమాన్ అహ్మద్(500 కేజీలు) బరువు తగ్గే ఆపరేషన్ కోసం శనివారం ముంబైకి చేరుకుంది. ఈజిప్ట్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానంలో ప్రత్యేక బెడ్‌పై తీసుకొచ్చిన ఆమెను... ముంబై విమానాశ్రయం నుంచి సైఫీ ఆస్పత్రికి తరలించేందుకు క్రేన్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రక్‌లోకి క్రేన్ యంతో ఆమెను ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఆ ట్రక్‌ను అంబులెన్సు, పోలీస్ వాహనాలు అనుసరించాయి. కాగా, ఆస్పత్రిలో ఎమాన్ సం ప్రత్యేకంగా ఒక గదిని నిర్మించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అధిక బరువు కారణంగా ఎమాన్ గత 25 ఏళ్లుగా కైరోలోని తన ఇంటి నుంచి కాలు బయటపెట్టలేదని చెప్పారు.
నెలరోజుల పాటు పరిశీలనలో ఉంచి, అనంతరం ఆమెకు శస్త్రచికిత్స చేస్తామన్నారు. గత 25 ఏళ్లుగా ఎక్కడికీ కదలకపోవడం, పల్మొనరీ ఎంబాలిజంతో తీవ్రంగా బాధపడుతుండటంతో ఎమాన్ తరలించడం కోసం శ్రమించాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు. ఆమెను ఇంటి నుంచి బయటికి తీసుకురావడానికి గది గోడలను బద్దలుకొట్టారు. ఈజిప్ట్ కు చెందిన విమానంలో బెడ్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే తగిన చికిత్స అందించేందుకు వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు తదితరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎమాన్ ప్రస్తుతం సర్జరీ నిఫుణుల పర్యవేక్షణలో ఉంది.