
మనకూ భూకంపాలను ముందే గుర్తించే వ్యవస్థ
న్యూఢిల్లీ: భూకంపాలు ప్రపంచంలో ఎక్కడైనా ఊహించని విపత్తును సృష్టిస్తున్న విషయం తెల్సిందే. భూకంపాలు వచ్చే విషయాన్ని కొన్ని క్షణాల ముందు కనుక్కున్నా కొన్ని వేల ప్రాణాలను రక్షించుకోగలం. అపార నష్టాన్ని తగ్గించుకోగలం. భూప్రకంపనలను కనీసం 30 సెకన్ల ముందు కచ్చితంగా కనుక్కొనే అత్యాధునిక ‘వార్నింగ్ అండ్ సెక్యూరిటీ’ వ్యవస్థను త్వరలో మన దేశంలోనూ ఏర్పాటు చేసుకోబోతున్నాం.
ప్రస్తుతం మన దేశంలో ఉపయోగిస్తున్న ప్రకంపనల హెచ్చరిక వ్యవస్థ ప్రాథమిక ప్రకంపనలను గుర్తించి మాత్రమే అలారం ద్వారా పౌర అధికారులను హెచ్చరించగలదు. కానీ ఇప్పుడు కొత్తగా నెలకొల్పబోతున్న వ్యవస్థ ప్రాథమిక ప్రకంపనలను కూడా కనీసం 30 సెకన్ల ముందు గుర్తించి హెచ్చరించగలదు. 2010లో చిలీలో వచ్చిన భూప్రకంపనలను 30 సెకన్ల ముందు కనుక్కోవడం వల్ల అక్కడ అపార ప్రాణ, ఆస్తి నష్టాలను నియంత్రించగలిగారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇంతకుమించిన ఆధునిక వ్యవస్థలేదు.
‘ఎర్త్‌క్వేక్ వార్నింగ్ అండ్ సెక్యూరిటీ’గా పిలిచే ఈ వ్యవస్థలో సెక్యూరిటీ ఫీచర్లు ఉండడం మరీ విశేషం. ఈ వ్యవస్థ ద్వారా నగరాల్లో అపార నష్టానికి కారణమవుతున్న ఎలక్ట్రిక్, ఎనర్జీ వ్యవస్థలను నిలిపివేయవచ్చు. ఫ్లడ్ వాటర్ వ్యవస్థ దెబ్బతినకుండా చూడొచ్చు. ఆకాశ హర్మ్యాల్లోని లిఫ్టులను క్షణాల్లో నిలిపివేయవచ్చు. కెమికల్ ప్లాంట్స్, లాబరేటరీలను, హాస్పత్రులను రక్షించుకోవచ్చు. అదే సమయంలో అత్యవసర ద్వారాలను తెరవవచ్చు.
నగరాల్లోని అన్ని ముఖ్యమైన వ్యవస్థలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధించి ఇవన్నింటినీ సాధించవచ్చు. ఈ వ్యవస్థ వైర్‌లెస్ ద్వారా కూడా నగరమంతటా పనిచేస్తోంది. ఈ వ్యవస్థను భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతం విస్తీర్ణం, భూకంపాల తీవ్రతను బట్టీ భారీ అలారాలను మోగిస్తుంది. వెంటనే ఆటోమేటిక్‌గా సెక్యూరిటీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.
జర్మనీకి చెందిన ‘సెక్టీ ఎలక్ట్రానిక్స్’ కంపెనీ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో ఇప్పటికే 25 దేశాలు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇదే కంపెనీ ఇండియన్ పార్టనర్ ‘టెర్రా టెక్కామ్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా భారత్‌కు అందిస్తోంది. దేశంలో దీన్ని జనవ రి లేదా ఫిబ్రవరిలో ఏర్పాటు చేయబోతోంది.