
భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవంతి
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల్లో 12 మంది మృతి చెందగా 125 మంది గాయపడ్డారని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 10:55 గంటలకు (స్థానిక కాలమానం) రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మొదటి భూకంపం రాగా, రెండవది మంగళవారం సంభవించిందని చైనా భూకంప విభాగం తెలిపింది. చాంగింగ్ కౌంటీలోని యిబిన్ నగరానికి దగ్గర్లో భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూకంప తీవ్రతకు యిబిన్, జుయోంగ్ పట్టణాల మధ్య ఉన్న రహదారి బీటలు వారడంతో ఆ దారిని మూసివేశారు. దాదాపు ఒక నిమిషం పాటు భవనాలు ఊగాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఊగిసలాట కారణంగా పలు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మరణాల్లో అత్యధిక శాతం భవనాల కింద చిక్కుకొన్నవారివే ఉన్నాయన్నారు. గాయాలపాలైన 53 మందిని చాంగింగ్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని రక్షక బృందం తెలిపింది.