రూ.27కోట్ల విలువైన సీఎం ఫాంహౌస్ జప్తు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు సంబంధించిన ఓ ఫాంహౌస్‌ను జప్తు చేసింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో మ్యాపిల్ డెస్టినేషన్స్ అండ్ డ్రీమ్‌బిల్డ్ అనే బినామీ పేరుతో ఉన్న ఈ ఫాంహౌస్ మార్కెట్ విలువ సుమారు రూ. 27 కోట్లు. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఫాం హౌస్‌ను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసిన విషయం విదితమే.
ఇప్పటికే పలుమార్లు వీరభద్రసింగ్, ఆయన బంధువుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రతిభాసింగ్‌తో పాటు మరికొందరిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వీరభద్రసింగ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై న్యాయస్థానం ఈ నెల 6వ తేదీన వాదనలు విననుంది.