Himachal Pradesh CM
-
హిమాచల్‌లో ఉత్కంఠకు తెర
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. కొత్త సీఎంగా జైరాం ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జైరాం ఠాకూర్‌ను తమ నాయకుడిగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూమల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సివచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు వినిపించినప్పటికీ చివరికి జైరాం ఠాకూర్ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. వివాదరహితుడిగా పేరున్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2007 నుంచి 2012 వరకు హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో జైరాం ఠాకూర్ పేరును ధూమల్ ప్రతిపాదించడం విశేషం. తన పేరును ధూమల్ ప్రతిపాదించగా జేపీ నడ్డా, శాంతకుమార్ మద్దతు తెలిపారని జైరాం ఠాకూర్ తెలిపారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. హిమాచల్‌లో ఉత్కంఠకు తెర -
హిమాచల్ ఉత్కంఠకు తెర
-
9 గంటలపాటు సీఎంపై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: అక్రమాస్తులకు సంబంధించిన కేసు విచారణను ఎదుర్కోవడం కోసం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(82) గురువారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తన అధికారిక వాహనంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం దాదాపు 9 గంటలపాటు ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. గత యూపీఏ–2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. గతవారంలోనే కేసు విచారణకు హాజరు కావాలంటూ వీరభద్ర సింగ్‌కు ఈడీ సమన్లు ఇచ్చినా.. తనకు కొన్ని అధికారిక పనులు ఉన్నాయనీ, తర్వాతి వారం వస్తానని ఆయన చెప్పారు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేస్తూ గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. వీరభద్ర సింగ్ విచారణకు హాజరైతే, ఆయనను అరెస్టు చేయబోమంటూ తాము ముందుగానే భరోసా ఇవ్వలేమని ఈడీ బుధవారమే ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది. -
హిమాచల్ సీఎంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం మరోసారి సమన్లు పంపింది. ఈనెల 20న విచారణ నిమిత్తం తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గతంలో ఏప్రిల్ 13న హాజరు కావాలని సమన్లు పంపినప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఇప్పటికే అతని భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య సింగ్‌లను మనీ లాండరింగ్ కేసులో విచారించింది. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు చెందిన ఫాంహౌస్‌ను ఈడీ జప్తు చేసింది. దీని విలువ రూ.27.29 కోట్లు. రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు కేంద్రం సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటోందని, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తనను వేధిస్తోందని ఫాంహౌస్‌ను సీజ్ చేసిన తర్వాత వీరభద్రసింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు వీరభద్రసింగ్, ఆయన బంధువుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
అక్రమాస్తుల కేసు: సీఎంకు మళ్లీ సమన్లు
షిమ్లా: మనీలాండరింగ్ కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు చిక్కులు తప్పేలాలేవు. గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఇంతకుముందు ఈడీ సమన్లు పంపగా.. వీరభద్ర సింగ్ వెళ్లలేదు. దీంతో ఈడీ తాజాగా మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వీరభద్ర సింగ్‌తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు సంబంధించిన ఓ ఫాంహౌస్‌ను జప్తు చేసింది. ఈ ఫాంహౌస్ మార్కెట్ విలువ సుమారు రూ. 27 కోట్లు. అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసింది. 2015 సెప్టెంబర్‌లో సీబీఐ ఫిర్యాదు మేరకు ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. -
రూ.27కోట్ల విలువైన సీఎం ఫాంహౌస్ జప్తు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఢిల్లీలోని వీరభద్రసింగ్‌కు సంబంధించిన ఓ ఫాంహౌస్‌ను జప్తు చేసింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో మ్యాపిల్ డెస్టినేషన్స్ అండ్ డ్రీమ్బిల్డ్ అనే బినామీ పేరుతో ఉన్న ఈ ఫాంహౌస్ మార్కెట్ విలువ సుమారు రూ. 27 కోట్లు. పీఎంఎల్ఏ చట్టం కింద ఫాం హౌస్‌ను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్‌పై సీబీఐ రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు వీరభద్రసింగ్, ఆయన బంధువుల ఆస్తులపై పలుమార్లు దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రతిభాసింగ్తో పాటు మరికొందరిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా అక్రమాస్తులకు సంబంధించి తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పెట్టిన కేసును రద్దు చేయాలంటూ వీరభద్రసింగ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై న్యాయస్థానం ఈ నెల 6వ తేదీన వాదనలు విననుంది. -
సీఎం బంధువును దారుణంగా చంపేశారు
చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారును ఆయనపై మూడుసార్లు తొక్కించడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్‌కు మేనల్లుడు ఆకాంశ్ సింగ్ (28) బుధవారం అర్ధరాత్రి లేట్ నైట్ పార్టీలో పాల్గొన్నాడు. గురువారం తెల్లవారుజామున పార్టీలో వారు గొడవపడ్డారు. ఇద్దరు స్నేహితులు.. ఆకాంశ్‌ను కొట్టి, ఆయనపై కారును మూడుసార్లు పోనిచ్చారు. బీఎండబ్ల్యూ కారును ఆకాంశ్‌ను 50 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రక్తపుమడుగులో పడిఉన్న ఆకాంశ్‌ను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. కాగా తీవ్రంగా గాయపడ్డ ఆకాంశ్‌ను చాలా ఆలస్యంగా గుర్తించారు. శుక్రవారం చండీగఢ్‌లోని ఆస్పత్రిలో తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. నిందితులను హర్మితాబ్ సింగ్ ఫరీద్, బలరాజ్ సింగ్ రంధావాలుగా గుర్తించారు. వీరిద్దరిపై హత్యకేసు నమోదు చేశామని, పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పోలీసుల విచారణ తీరుపై వీరభద్ర సింగ్ కుటుంబ సభ్యులు విమర్శించారు. హత్య జరిగిన 24 గంటలు దాటినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ అన్నారు. వీరభద్ర సింగ్ మాట్లాడుతూ.. తాను పంజాబ్ గవర్నర్‌తో మాట్లాడానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరానని, నిందితులు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని చండీగఢ్ వచ్చారు. -
హిమాచల్ సీఎంకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ (86) ఛాతీ సంబంధిత సమస్యతో ఆదివారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని సోమవారం వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఆస్పత్రికి వెళ్లి ముఖ్యమంత్రిని పరామర్శించారు. పలువురు రాష్ట్ర మంత్రులు ఆస్పత్రికి వెళ్లి సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరభద్ర సింగ్ సొంత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఛాతీనొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జేపీ నద్దా కూడా పాల్గొన్నారు. సీఎంను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. -
సీఎం కొడుకును ప్రశ్నించిన సీబీఐ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను సీబీఐ ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు విక్రమాదిత్య ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ కేసులో వీరభద్రసింగ్ పిల్లలు విక్రమాదిత్య, అపరాజితా కుమారిలను సాక్షులుగా పిలిచినట్లు ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ సోమవారమే తెలిపింది. అయితే.. సీబీఐ తమను పిలిచిన తర్వాత అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ వాళ్లిద్దరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తమ తల్లిదండ్రులతో పాటు వేరేవారిని కూడా నిందితులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు గానీ తమ పేర్లు ఎక్కడా లేవని తెలిపారు. తాము విచారణకు సహకరిస్తాము గానీ, సీబీఐ తమను అరెస్టు చేస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రతిభా సింగ్, ఎల్ఐసీ ఏజెంటు ఆనంద్ చౌహాన్ తదితరులపై గత సంవత్సరం సెప్టెంబర్ 23న అవినీతి నిరోధక చట్టం కింద కేసు దాఖలైంది. ప్రాథమిక విచారణ అనంతరం వీరభద్రసింగ్ రూ. 6.03 కోట్ల సంపద మూటగట్టుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. 81 ఏళ్ల సింగ్ ను ఇప్పటికే రెండుసార్లు సీబీఐ ప్రశ్నించింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు సహకరించకపోవడం, ఆస్తుల గురించిన సమాచారం ఏదీ చెప్పకపోవడంతో ఇప్పుడు ఆయన పిల్లల వంతు వచ్చింది. -
సీబీఐ ఎదుట ఎందుకు హాజరుకారు?
న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. తమంత తాముగా సీబీఐ ఎందుకు హాజరుకాకూడని హిమాచల్ సీఎంను ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తుకు ఎందుకు సహకరించడం లేదని నిలదీసింది. దర్యాప్తుకు సహకరిస్తే విచారణ త్వరగా పూర్తవుతుందని కదా అని ప్రశ్నించింది. వీరభద్ర సింగ్ వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడంతో దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని వివరించింది. వీరభద్ర సింగ్ అక్రమ ఆస్తుల కేసులో ఢిల్లీ హైకోర్టు రేపటి(బుధవారం) నుంచి వాదనలు విననుంది. -
వీరభద్ర సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ను అరెస్ట్ చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో వీరభద్ర సింగ్ రూ.6.57 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు ఈడీ ఆరోపించింది. ఇప్పటికే ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఫోర్జరీ నేరం కింద ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. వీరభద్ర సింగ్, ఆయన అనుచరులపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరభద్ర సింగ్ అరెస్టైతే ఉత్తరాఖండ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. తనచుట్టూ ఉచ్చు బిగుస్తుండడంతో వీరభద్ర సింగ్ హైకమాండ్ ను ఆశ్రయించారు. సోమవారం ఆయన సోనియా గాంధీని కలిశారు. తనపై వచ్చిన ఆరోపణలపై 'మేడమ్'కు వివరణయిచ్చారు. -
సీఎం ఇంట్లో సీబీఐ దాడులా!
'నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. అత్యున్నత పదవిలో ఉన్న నాపై కేసు నమోదు చేయాలంటే ముందు ప్రాసిక్యూషన్, ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. ఇది నేను చెబుతున్న విషయం కాదు. రాజ్యాంగమే పేర్కొంది. అలాంటిది.. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ నా ఇల్లు, ఆఫీసులోకి చొరబడి దాడులు చేస్తుందా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ లోని ఆరో సెక్షన్ ప్రకారం ఇది కచ్చితంగా చట్ట విరుద్ధం. ఎఫ్ఐఆర్ లో నా పేరు, నా భార్య పేరు చేర్చడం దారుణం. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. అందుకే ఈ విషయంలో మీరు కలుగజేసుకోవాలని కోరుతున్నాను'.. అంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ షిమ్లా హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వీరభద్రసింగ్, అతని సతీమణుల అక్రమ ఆస్తుల వ్యవహారంపై ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ దర్యాప్తు జరుపుతున్నది. ఈలోపే సీబీఐ కూడా ఇదే వ్యవహారానికి సంబంధించి ఆ ఇరువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరభద్ర సింగ్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. జస్టిస్ రాజివ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ సింగ్ ఠాకూర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. -
హిమాచల్ సీఎంపై అవినీతి కేసు నమోదు!
-
హిమాచల్ సీఎంపై అవినీతి కేసు నమోదు!
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీలోని 11 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అవినీతికి పాల్పడ్డారని వీరభద్ర సింగ్‌పై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. వీరభద్రసింగ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన ఆదాయం కంటే రూ. 6.1 కోట్ల మేర అధికంగా ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఆయన భార్య ప్రతిభాసింగ్, కొడుకు విక్రమాదిత్య, కూతురు అపరాజితలపై కూడా కేసులు నమోదయ్యాయి. 80 ఏళ్ల వయసున్న వీరభద్రసింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన భార్య, పిల్లలు కొన్ని ప్రైవేటు బ్యాంకుల నుంచి ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా రుణాలు తీసుకున్నారని, దానికి బదులుగా ఆయా కంపెనీలకు సీఎంగా ఆయన మేలు చేశారని ఆరోపణలున్నాయి. లంచాలు, మనీ లాండరింగ్, ఫోర్జరీ తదితర ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేంద్ర మాజీమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ఇంట్లో కూడా సీబీఐ వర్గాలు అవినీతి కేసులో సోదాలు చేశాయి. -
80 ఏళ్ల వయసులో కంప్యూటర్ తో కుస్తీ
సిమ్లా: హిమచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నారు. 80 ఏళ్ల ఈ రాజకీయ కురువృద్ధుడు కంప్యూటర్ పాఠాలు వల్లె వేస్తున్నారు. ఆయనేదో డిగ్రీ సాధించేందుకు ఇలా చేయడం లేదు. తమ శాసనసభను దేశంలోనే ప్రప్రథమ ఇ-అసెంబ్లీ మార్చాలని ఆయన సంకల్పించారు. ఇందులో భాగంగా తాను కూడా కంప్యూటర్ నేర్చుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కంప్యూటర్ పాఠాలు వల్లెవేస్తున్నారు. అంతేకాదు కంప్యూటర్ తెరపై డిజిటల్ పేజీలను పైకి, కిందకు కదిలిస్తూ ప్రశ్నలకు అసెంబ్లీలో ఎలా సమాధానమివ్వాలనే దాని గురించి కూడా ఆయన నేర్చుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాము డిజిటల్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వీరభద్రసింగ్ అన్నారు. అసెంబ్లీ డిజిటలైజేషన్ కోసం హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వం రూ. రూ.8.12 కోట్లు వెచ్చించనుంది.