9 గంటలపాటు సీఎంపై ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: అక్రమాస్తులకు సంబంధించిన కేసు విచారణను ఎదుర్కోవడం కోసం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(82) గురువారం ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తన అధికారిక వాహనంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం దాదాపు 9 గంటలపాటు ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది.
గత యూపీఏ–2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
గతవారంలోనే కేసు విచారణకు హాజరు కావాలంటూ వీరభద్ర సింగ్‌కు ఈడీ సమన్లు ఇచ్చినా.. తనకు కొన్ని అధికారిక పనులు ఉన్నాయనీ, తర్వాతి వారం వస్తానని ఆయన చెప్పారు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేస్తూ గురువారం విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. వీరభద్ర సింగ్ విచారణకు హాజరైతే, ఆయనను అరెస్టు చేయబోమంటూ తాము ముందుగానే భరోసా ఇవ్వలేమని ఈడీ బుధవారమే ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది.