హిమాచల్ సీఎంపై అవినీతి కేసు నమోదు!
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్పై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీలోని 11 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అవినీతికి పాల్పడ్డారని వీరభద్ర సింగ్పై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. వీరభద్రసింగ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన ఆదాయం కంటే రూ. 6.1 కోట్ల మేర అధికంగా ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఆయన భార్య ప్రతిభాసింగ్, కొడుకు విక్రమాదిత్య, కూతురు అపరాజితలపై కూడా కేసులు నమోదయ్యాయి.
80 ఏళ్ల వయసున్న వీరభద్రసింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన భార్య, పిల్లలు కొన్ని ప్రైవేటు బ్యాంకుల నుంచి ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా రుణాలు తీసుకున్నారని, దానికి బదులుగా ఆయా కంపెనీలకు సీఎంగా ఆయన మేలు చేశారని ఆరోపణలున్నాయి. లంచాలు, మనీ లాండరింగ్, ఫోర్జరీ తదితర ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేంద్ర మాజీమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ఇంట్లో కూడా సీబీఐ వర్గాలు అవినీతి కేసులో సోదాలు చేశాయి.