Satya Pal Malik: మాజీ గవర్నర్‌ ఇంట సీబీఐ సోదాలు | Kiru Hydropower Corruption Case: CBI raids Satya Pal Malik House | Sakshi
Sakshi News home page

Satya Pal Malik: జమ్ము మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంట సీబీఐ సోదాలు

Published Thu, Feb 22 2024 12:54 PM | Last Updated on Thu, Feb 22 2024 1:20 PM

Kiru Hydropower Corruption Case: CBI raids Satya Pal Malik House - Sakshi

ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ను దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. తాజాగా గురవారం ఆయన ఇంటితో పాటు 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిగాయి. ఆయన జమ్ము గవర్నర్‌గా ఉన్న సమయంలో.. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అవినీతి జరగడం.. దానిపై కేసు నమోదు కావడమే ఇందుకు కారణం. 

జమ్ములో రూ. 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్‌ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందని  ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏప్రిల్‌ 2022లో మాలిక్‌తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం 100 మంది అధికారులు పలు నగరాల్లో ఈ సోదాలు ప్రారంభించారని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఈ పరిణామాలపై సత్యపాల్‌ మాలిక్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తున్నారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని వెల్లడించారు.

మరో ట్వీట్‌లో.. అవినీతికి పాల్పడిన వారిపై నేను ఫిర్యాదు చేస్తే.. ఆ వ్యక్తుల్ని విచారించకుండా నా నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. ఇంట్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప మరేమీ వాళ్లకు దొరకలేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆ నియంత నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను.. తలవంచను అంటూ పోస్ట్‌ చేశారాయన. 

మాలిక్‌.. 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మాలిక్‌ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న కిరూ హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించింది కాగా.. , రెండోది  ఇన్సూరెన్స్‌ స్కీమ్‌కు సంబంధించిన ఆరోపణలు.

ఇన్సూరెన్స్‌ ఒప్పందం నేపథ్యం.. 
2018లో సదరు కంపెనీ కాంట్రాక్ట్‌ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ మాలిక్‌ ఆ ఫైల్స్‌ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ మాలిక్‌.  

ఈ బీమా పథకం ఒప్పందానికి సంబంధించిన అవినీతి కేసులో మాలిక్‌ను సీబీఐ సాక్షిగా చేర్చింది. గతంలో ఐదు గంటలపాటు విచారించింది కూడా.  ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ.  ఇందులో మోసం జరిగిందని మాలిక్‌ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే ఆయన్ని ప్రశ్నించినట్లు సీబీఐ ప్రకటించింది.  

సంచలనంగా సత్యపాల్‌ మాలిక్‌
చరణ్‌ సింగ్‌ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్‌ మాలిక్‌. ఆ తర్వాత భారతీయ లోక్‌దల్‌ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్‌.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్‌, జమ్ము కశ్మీర్‌, గోవా, మేఘాలయాకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్‌గా ఉన్నారు.

రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్‌ 14వ తేదీన) కరణ్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ గవర్నర్‌గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్‌ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్‌ పాక్‌ నుంచి రావడం, జమ్ము కశ్మీర్‌లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్‌ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement