చిదంబరానికి మరిన్ని కష్టాలు
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరిన్ని కష్టాలు వస్తున్నాయి. ఆయన కుమారుడు, వ్యాపారవేత్త అయిన కార్తీ చిదంబరాన్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విచారణకు రావాల్సిందిగా ఎన్నిసార్లు పిలిచినా కార్తీ రాకపోవడంతో.. ఇక కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్ విషయమై ప్రశ్నించేందుకు ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని ఆయనను ఇప్పటికి మూడుసార్లు పిలిచారు. 2జీ స్కాంలో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎయిర్‌సెల్-మాక్సిస్ డీల్‌పై ఈడీ విచారణ సాగిస్తోంది.
కార్తీ చిదంబరాన్ని విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికి మూడు సార్లు పిలిచింది. వ్యక్తిగతంగా హాజరు కావల్సిందేనంటూ మూడోసారి గట్టిగా చెప్పింది. అయినా కార్తీ మాత్రం విచారణకు రాలేదు. ఒకసారి మాత్రం.. అసలు తాను చేసిన తప్పేంటని కార్తీ అడిగినట్లు సమాచారం. ఇక కార్తీని అదుపులోకి తీసుకోవడం ఒక్కటే మార్గమని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. చిదంబరం భార్య నళినీ చిదంబరాన్ని కూడా గతవారం ఈడీ వర్గాలు మరో కేసులో ప్రశ్నించాయి. శారదా చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించి కోల్‌కతాలోని ఈడీ కార్యాలయం ఆమెను విచారించింది.