
‘గంగలో రాహుల్ దూకాలి.. లేదంటే నేను దూకుతా’
ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీజేపీ తాజాగా మరోసారి మాటల యుద్ధం ప్రకటించింది.
వారణాసి: ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీజేపీ తాజాగా మరోసారి మాటల యుద్ధం ప్రకటించింది. గంగా నది విషయంలో మోదీని విమర్శించిన రాహుల్‌పై కేంద్ర మంత్రి ఉమా భారతి విరుచుకుపడ్డారు. ‘రాహుల్‌గాంధీ అయినా గంగా నదిలో దూకాలి.. లేదంటే నేను దూకుతాను’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ది పరిపక్వత లేని మెదడు అని అన్నారు.
ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాహుల్ ఏ థాయిలాండ్‌కో పారిపోవడం కాదని, నేరుగా తనతో గంగా నది వద్దకు రావాలని, అప్పుడు గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభంకాకుంటే తాను గంగలో దూకుతానని, లేదంటే రాహుల్ దూకాలని సూచించారు. వారణాసిలో పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌కు చేసిందేమి లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌కు కుమారుడిగా చెప్పుకున్న రాహుల్ గంగా నదిని తన కన్నతల్లిగా చెప్పుకున్నారని, ఇప్పుడు గంగా తల్లికి ఆయన చేసేందేమిటని ప్రశ్నించారు. యూపీకిగానీ, గంగకుగానీ ఏమైనా చేశారా అని నిలదీశారు. గంగను శుద్ధి చేశారా అంటూ విమర్శించారు.
ఈ నేపథ్యంలో రాహుల్‌పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆయనపై విరుచుకుపడ్డారు. ‘గంగా పరివాహక ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మొదలుకాలేదు. మేం ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ, ఇంతవరకు నో అబ్జెక్షన్ కాపీ వాళ్లు ఇవ్వలేదు. వాస్తవానికి గంగాకు నిజమైన శత్రువు అఖిలేశ్ యాదవ్. ఓసారి ములాయం వచ్చి గంగా నదిపై పనులు ప్రారంభం కాలేదని పార్లమెంటులో అరిస్తే ఇంతవరకు మీ రాష్ట్రమే ఎన్‌వోసీ ఇవ్వలేదని గుర్తు చేస్తే చప్పుడు చేయకుండా కూర్చున్నారు. కావాలనే గంగా శుద్ధి కార్యక్రమానికి యూపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. గంగా శుద్ధి కార్యక్రమం ప్రారంభం అవడం ఖాయం. అలా జరగకుంటే నేనన్నా అందులో దూకుతాను. రాహుల్ అయినా దూకాలి’ అని ఉమాభారతీ మండిపడ్డారు.