ఏపీలో నేదురుమల్లి మరణంతో ఖాళీ అయిన స్థానం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంతో పాటు.. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు జూలై 3న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా నేదురుమల్లి గత నెల 9వ తేదీన చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన స్థానాన్ని రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ స్థానంతో పాటు తమిళనాడులో టి.ఎం.సెల్వగణపతి మరణంతో ఖాళీ అయిన స్థానం..
ఒడిశాలో శశిభూషణ్‌బెహ్రా, రబినారాయణ్ మహాపాత్రల రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కలిపి మొత్తం నాలుగు స్థానాల ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల తుది గడువు ఈ నెల 23వ తేదీగా ప్రకటించింది. నామినేషన్ల పరిశీలనకు 24వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. వచ్చే నెల (జూలై 3న) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించింది.
రాజ్యసభ ఖాళీ సీట్ల ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్
Published Tue, Jun 17 2014 12:59 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM