నేడేవీ తల్లి! మేలైన మన జాతి కుక్కలు... | Endangered Indian dog breeds | Sakshi
Sakshi News home page

నేడేవీ తల్లి! మేలైన మన జాతి కుక్కలు...

Published Thu, Apr 27 2017 6:37 PM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM

నేడేవీ తల్లి! మేలైన మన జాతి కుక్కలు... - Sakshi

నేడేవీ తల్లి! మేలైన మన జాతి కుక్కలు...

న్యూఢిల్లీ: జర్మన్‌ షెపర్డ్, లాబ్రడర్, సెయింట్‌ బెర్నాడ్‌...ఈ పేర్లు వింటేనే కొంత మంది పెంపుడు కుక్కల ప్రేమికులు పులకించిపోతుంటారు. వీటికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. బొచ్చుతో బొద్దుగా కనిపించడమే కాకుండా యజమానులతోని బుద్ధిగా ఉంటాయని, ఎప్పుడూ వారి చుట్టే తిరుగుతాయన్నది వారి అభిమానానికి కారణం. ఈ మూడు జాతుల మధ్య ఉన్న కామన్‌ గుణమే ఎక్కువ మందికి నచ్చుతుందని చెప్పవచ్చు. అదే ఎక్కువ బొచ్చు కలిగి ఉండడం.

అదే చిప్పిపరాయ్, జొనాంగి, కొంబాయి...పేర్లు చెబితే ప్రపంచంలోని పెంపుడు కుక్కల ప్రేమికులే కాదు, భారతీయ ప్రేమికులు కూడా అవేమిటో  గుర్తుపట్టక గుడ్లు మిటకరించడం ఖాయం. ఇవన్ని అంతరించిపోతున్న భారతీయ కుక్కల జాతులు. విదేశీ కుక్కల మోజులో నిరాధరణకు గురవడంతో ఎన్నో భారత జాతి కుక్కలు అంతరించిపోగా, ఇప్పటికీ ఓ పాతిక జాతులు మిగిలి ఉన్నాయని ఎస్‌ థియోడర్‌ భాస్కరన్‌ తెలియజేస్తున్నారు. జంతు ప్రేమికుడు, వన్యప్రాణి సంరక్షణ వాదైన భాస్కరన్‌ భారత్‌లోని కుక్కల జాతిపై 40 ఏళ్లపాటు పరిశోధనలు జరిపి ‘ది బుక్‌ ఆఫ్‌ ఇండియన్‌ డాగ్స్‌’ పేరిట పుస్తకం రాశారు.

దోపిడీ దొంగల బారి నుంచి ప్రజలను కాపాడిన, అడవి జంతువుల నుంచి పశువులు, గొర్రెలను రక్షించిన చరిత్ర మన కుక్క జాతులది. చిరుత పులులతోటి, నక్కలతోటి వీరోచితంగా పోరాడి పశువులు, గొర్రెలను పరిరక్షించిన ఘన చరిత్ర కూడా ‘హౌండ్స్‌’ కుక్కల జాతీ మనదే. ఊరి పొలిమేరలో శత్రు కదలికలను కనుగొనడంలో, కంటిమీద కునుకేయకుండా నిఘా వేయడంలో మన జాతి కుక్కలు మేలైనవి. గొడ్డులా పనిచేయడం కూడా మన  కుక్కలకు తెలుసు. అందుకే మనల్ని ఆంగ్లేయులు ‘వర్క్‌ లైక్‌ ఏ డాగ్‌’ అని అనేవారట. హిమాలయ, సిక్కిం రాష్ట్రాల్లో కనిపించే లాసాఅప్సో జాతి కుక్కలను ఒకప్పుడు రాజుల కోటల్లో కాపలా కోసం ఉపయోగించేవారట.

వేటలో ఆరితేరిన ‘హౌండ్స్‌’ జాతి కుక్కలు
ఇక వేటలో ఆరితేరినవి ‘హౌండ్స్‌’ జాతి కుక్కలు. వీటిలో బంజారా హౌండ్స్, వగారి హౌండ్, రాంపూర్‌ హౌండ్‌ ముదోల్‌ హౌండ్‌ అనే పలు రకాల జాతులున్నాయి. ఇవి వేటలో ఆరితేరినవే కాకుండా పశువులను, మనుషులను అటవి క్రూర మగాల నుంచి రక్షించడంలో ప్రాణాలను పణంగా పెట్టేవి. ఈ జాతి కుక్కల పేరుతోనే ‘గ్రే హౌండ్స్‌’ దళాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందే. ఎప్పుడు బంజారాలతో ఉంటూ వారి ఆస్తులకు, పశువులకు రక్షణ కల్పించడం వల్ల హౌండ్స్‌ జాతిలో ఒకదానికి ‘బంజారా హౌండ్స్‌’ అని పేరు వచ్చింది.

బంజారా వాళ్లు స్వయంగా పశువుల పోషకులు కాకపోయినా ఒక రైతు పశువులను సంతకు తీసుకొల్లేవారు. సంతలో కొన్న పశువులను క్షేమంగా రైతుల ఇళ్లకు తీసుకొచ్చేవారు. ఇదే పనిమీద వారు ఊరు, వాడ అనకుండా అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు తిరిగేవారు. వారి వెంట తోలుకెళ్లే పశులతోపాటు వారికి కాపలాగా ఈ జాతి కుక్కలు వ్యహరించేవి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ  కనిపించే జొనాంగి జాతి కుక్కలు కూడా ప్రజలకు రక్షణ కల్పించేవి. మధురై ప్రాంతానికి చెందిన కొంబై జాతి, విజయనగరం సామ్రాజ్యానికి చెందిన పండికోన జాతి కుక్కలు ఇప్పటికీ ఏపీలోని నెల్లూరు జిల్లాలో కనిపించడం విశేషం.

అంతరించిపోతున్న జాతి కుక్కలు
కాలంతోపాటు పాలకులు మారడం, పరిస్థితులు మారడం, ప్రజలు మారడం వారి సంస్కతి మారడం లాంటి కారణాల వల్ల దేశీయ కుక్కల జాతులు అంతరించి పోతున్నాయి. బ్రిటీష్‌ కాలంలో పాలకులు ఆ దేశం నుంచి వారి జాతి కుక్కలను తెచ్చుకోవడం, భారత రాజులు కూడా అలాంటి జాతుల పట్ల మోజు చూపించడం, విదేశీ కుక్కలతో దేశీయ కుక్కలు సంకరం మొదలవడం తదితర కారణాల వల్ల స్వజాతి కుక్కలు అంతరించిపోతున్నాయని భాస్కరన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశీ కుక్కల జాతిని రక్షించుకునేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘కెన్నల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’ ఈవిషయంలో కొద్దిగా చొరవ తీసుకుంటోది. ఆ సంస్థకు ప్రభుత్వ చర్యలు తోడవితే ప్రస్తుతం విదేశీ జాతి కుక్కల మీద చూపిస్తున్న మన ప్రజల ప్రేమ మన జాతి కుక్కల మీదకు మళ్లుతుందేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement