మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!
మోదీ మెచ్చిన ఇంజనీరు.. దొంగనోట్ల వీరుడు!
Published Sat, Dec 3 2016 9:22 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
గత సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఓ యువ ఇంజనీరు చూపించిన ప్రతిభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతడిని ఎంతగానో ప్రశంసించారు. కానీ.. మోదీ సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త 2000 రూపాయల నోట్లకు నకిలీనోట్లను ముద్రించినందుకు పోలీసులు అతడిని పంజాబ్‌లోని మొహాలీలో అరెస్టుచేశారు. అతడి వద్ద రూ. 42 లక్షల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ వర్మ అనే ఈ యువ ఇంజనీరుతో పాటు, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌పాల్‌లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లు ముగ్గురూ ప్రజల వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని, తాము ముద్రించిన 2000 రూపాయల నోట్లను కమీషన్ పద్ధతిలో ఇస్తున్నారు. కొత్త నోట్లు ఇచ్చినందుకు వాళ్ల దగ్గర 30 శాతం కమీషన్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఇంతా చేస్తే.. వాళ్లిచ్చేది దొంగనోట్లు. ఆ విషయం తెలియక ఇప్పటికి ఎంతమంది వాళ్ల బుట్టలో పడ్డారో తెలియదు.
వీళ్లు ముగ్గురూ కేవలం వీవీఐపీలు మాత్రమే వాడాల్సిన ఎర్రబుగ్గతో అత్యాధునికమైన సరికొత్త ఆడి ఎస్‌యూవీలో వెళ్తుండగా తాము ఆపి తనిఖీ చేశామని మొహాలీ నగర ఎస్పీ పర్మీందర్ సింగ్ చెప్పారు. అప్పుడే ఈ 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయన్నారు. ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నారని, కానీ ఆ ఇద్దరూ పారిపోయారని పోలీసులు చెప్పారు.
మోదీ ఎందుకు మెచ్చుకున్నారు..
అభినవ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటుచేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అతడు తయారుచేశాడు. వాటి సాయంతో అంధులు కర్రకు ముందు ఏముందో కూడా తెలుసుకోవచ్చు. గోతులు గానీ, రాళ్లు గానీ ఏవైనా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు మోదీ ఇతడిని జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అభినందించారు. కానీ, చండీగఢ్‌లోని తన కార్యాలయంలో ఇప్పుడు అతడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు చెప్పారు.
Advertisement