సీబీఐ డైరెక్టర్‌కు చుక్కెదురు
ప్రజావేగు పేరు తెలియకపోయినా విచారిస్తామన్న సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: 2జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు సోమవారం సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇంటి వద్ద సందర్శకుల జాబితాలో వివాదాస్పద నమోదులపై సమాచారం ఇచ్చిన ప్రజావేగు పేరు తెలియకపోయినా ఆయనపై వచ్చిన ఆరోపణలపై దాఖలైన ఫిర్యాదును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో 2జీ కేసుల విచారణ కోసం నియమించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పీపీ) సహాయాన్ని కోరింది. సీల్డ్ కవర్లో ప్రజావేగు పేరు తెలపాలని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరతూ ఎన్‌జీవో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అదే సమయంలో ప్రజావేగు పేరు వెల్లడించడానికి ఆ ఎన్‌జీవో నిరాకరించడంతో ఈ కేసును ఇక్కడితో ముగించాలంటూ సీబీఐ డెరైక్టర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ చేసిన వాదనను ధర్మాసనం తిప్పికొట్టింది. తనపై వచ్చిన ఫిర్యాదులపై ఒక్క రోజు విచారణ కొనసాగినా అది 2జీ కేసులపై ప్రభావం చూపి ప్రజలకు చేటు చేస్తుందని రంజిత్ వేడుకోగా.. తాము అలా భావించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ ఫైళ్లు, రంజిత్ సిన్హాపై ఆరోపణలకు సంబంధించిన సందర్శకుల జాబితాతో పాటు అన్ని పత్రాలను ఎస్‌పీపీ ఆనంద్ గ్రోవర్‌కు అప్పగించాలని ధర్మాసనం సూచించింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే నెల 10న జరిగే తదుపరి విచారణలో గ్రోవర్ కోర్టుకు సహకరిస్తారని ధర్మాసనం పేర్కొంది. అంతకు ముందు కోర్టు ఆదేశాలిచ్చినా ఆ ప్రజావేగు పేరు తెలపకపోవడంపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ భేషరుతుగా క్షమాపణ కోరారు.