అంతా వారే చేశారు!
భువనేశ్వర్: దేశవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే విధానాలు, ప్రాజెక్టుల అమలు జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని.. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. నిర్దేశించుకుంటున్న ప్రాజెక్టులన్నీ అనుకున్న గడువులోగా పూర్తయ్యేందుకు ‘పని సంస్కృతి’ (వర్క్ కల్చర్)ను ప్రోత్సహిస్తూ ఎన్డీఏ సర్కారు ముందుకెళ్తోందన్నారు. పారాదీప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ను ఆయన ఆదివారం జాతికి అంకితం చేసి ప్రసంగించారు. కాంగ్రెస్ ఆందోళనలు, అనవసర విధానాల వల్ల ప్రాజెక్టుల జాప్యం జరుగుతోందని.. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదనేదే తమ ఆలోచన అనితెలిపారు.
‘కాంగ్రెస్ మిత్రులు మేమే ఇలాంటి సంస్కృతి(అమలును అడ్డుకోవటం) ని ప్రారంభించామంటున్నారు. కానీ మాకు ఆ అవసరం లేదు. 15 ఏళ్ల క్రితమే ఇవన్నీ జరిగుంటే సంతోషించేవాడిని’ అని అన్నారు. ‘2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి గ్రీన్‌ఫీల్డ్‌కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే దీన్ని జాతికి అంకితం చేశాం. ఇంత మంచి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 15 ఏళ్లు పట్టడం కాంగ్రెస్ అలసత్వానికి మంచి ఉదాహరణ’ అని తెలిపారు. దేశాభివృద్ధికి.. పౌరులు, పరిశ్రమలు, విధాన నిర్ణేతలు అందరూ కలిసి ‘సరైన సమయంలో పని ప్రారంభించి.. నిర్ణీత సమయంలో పూర్తి చేసే’ పని సంస్కృతిని అలవర్చుకోవాలన్నారు. కాగా, ప్రజలకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించాలని ప్రధాని భువనేశ్వర్‌లోని నైసర్(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్) లో జరిగిన కార్యక్రమంలో కోరారు. ఒడిశాకు ప్రత్యేక హోదా కల్పించి అన్ని రంగాల్లో పురోగతి సాధించేలా కేంద్రం ఆదుకోవాలని సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. పారాదీప్ రిఫైనరీపై ప్రధానమంత్రివి అబద్ధాలని కాంగ్రెస్ పేర్కొంది.
జగన్నాథుని దర్శనం.. పూరీలోప్రసిద్ధ జగన్నాథ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. పూరీనగర ప్రజల ప్రేమానురాగాలు తనను కదిలించాయన్నారు.
మాకూ ఆ కళ నేర్పండి!.. ప్రధాని మోదీ.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌ను గుజరాత్‌కు ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో యువతకు సైకత శిల్ప కళలో శిక్షణ ఇవ్వాలని కోరారు. జగన్నాథాలయంలో మోదీ దర్శనం చేసుకుంటున్న సమయంలోనే పట్నాయక్ కలిశారు. ‘నవకళేబర’ వేడుక సందర్భంగా తను వేసిన జగన్నాథుని సైకతశిల్పం ఫొటోను ప్రధానికి బహూకరించారు. ‘ప్రధానిని కలవటం ఆనందంగా ఉంది. ఆయన కోరినట్లుగా గుజరాత్‌లో ఓ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాను’ అని పట్నాయక్ తెలిపారు.