కార్డియాక్‌ అరెస్ట్‌ ఎందుకంటే... | Everything you need to know about this deadly attack! | Sakshi
Sakshi News home page

కార్డియాక్‌ అరెస్ట్‌ ఎందుకంటే...

Published Mon, Feb 26 2018 4:16 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Everything you need to know about this deadly attack! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం యావత్‌ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎప్పుడూ ఆరోగ్యంగా, చెలాకీగా కనిపించే శ్రీదేవి ‘సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌’కు గురై కన్నుమూయడం ఆమె అభిమానులనే కాదు హృద్రోగ నిపుణు లను సైతం నివ్వెరపరిచింది. ఉన్నఫళంగా ఆమె ‘సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌’కు ఎందుకు గురైందనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే...

ఒత్తిడి వల్ల గుండె రక్తనాళాలు కుంచించుకుపోతాయి...
కొందరు సెలబ్రిటీలు కెరీర్, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఒత్తిడి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. మనిషి ఒత్తిడికి గురైనప్పడు గుండె వేగం 120 నుంచి 150సార్లకు పైగా కొట్టుకుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుంచించుకుపోతాయి. అప్పటివరకు రక్తనాళాల్లో బ్లాకులు లేకపోయిన ప్పటికీ ఒత్తిడి వల్ల అవి కుంచించుకుపోయి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు కారణమవుతాయి.

– డాక్టర్‌ ఆర్‌.వి. కుమార్, హృద్రోగ నిపుణుడు, నిమ్స్‌

అతిగా వ్యాయామాలతోనూ చేటు...
సెలబ్రిటీ స్టేటస్‌ను మేనేజ్‌ చేసుకోవడం ఒక దశకు వచ్చిన తర్వాత చాలా కష్టం. వృద్ధాప్యంలో కూడా అందంగా కన్పించాలనే కాంక్షతో కొందరు అతిగా వ్యాయామాలు చేయడం, ఆకలి తగ్గించే మందులు వాడుతుండటం చేస్తుంటారు. వేళకు తినకపోవడం వల్ల శరీరంలో పొటాషియం లెవల్స్‌ పడిపోతుంటాయి. ఒక్కోసారి ఇవి కార్డియాక్‌ అరెస్ట్‌కు దారితీస్తుంటాయి. ఒక దశ దాటిన తర్వాత ఏ పని ఎంతసేపు చేయాలో అంతే చేయాలి. వైద్యుల సలహా మేరకు డైట్‌ ఎంచుకోవాలి. 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏటా విధిగా హెల్త్‌ చెకప్‌లు చేయించుకోవాలి.    

– డాక్టర్‌ గోపిచంద్‌ మన్నెం, హృద్రోగ నిపుణుడు, స్టార్‌ ఆస్పత్రి

షాక్‌కు గురయ్యా..
శ్రీదేవి మరణ వార్త విని షాక్‌కు గురయ్యా. కోట్లాది అభిమానుల గుండెలు బద్దలు కొట్టేసి ఆమె వెళ్లిపోయారు. ముండ్రం పిరై, లమ్హే, ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ చిత్రాల్లో ఆమె నటన ఎందరో నటీనటులకు ఆదర్శం. ఆమె కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి.    
– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రతిభగల నటి..
ఎంతో ప్రతిభ కలిగిన నటి శ్రీదేవి. ఆమె హఠాన్మరణం వల్ల తీవ్ర బాధ కలిగింది. దక్షిణాది భాషా చిత్రాలతోపాటు హిందీలోనూ ఆమె వైవిధ్యభరితమైన నటనను కనబరిచారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.    
– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఎంతో బాధించింది..
శ్రీదేవి అకాల మరణం నన్నెంతో బాధించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనను కన బరిచి చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటిగా ఆమె చెరగని ముద్రవేశారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యు లకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.     
– ప్రధాని నరేంద్ర మోదీ

బహుముఖ ప్రజ్ఞాశాలి..
శ్రీదేవి అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ఆమె అసా ధారణ ప్రతిభ కలిగిన నటి. బహు ముఖ ప్రజ్ఞాశాలి. అనేక భాషల్లో వివిధ రకాల చిత్రాల్లో నటించారు. ఆమె కుటుంబానికి నా సానుభూతి. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.
–రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

శ్రీదేవి మృతికి గవర్నర్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీదేవి అకాల మరణం పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు గవర్నర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు.  

సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం
ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల సినిమాల్లో తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. చిన్న వయసులోనే ఆమె మరణించడం విచారకరమన్నారు. శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులకు ఎంతో వెలితిని మిగిల్చిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

ఏపీ సీఎం సంతాపం  
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణానికి ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

శ్రీదేవి మృతి పట్ల జగన్‌ దిగ్భ్రాంతి
ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీదేవి తన నటన, ప్రతిభాపాటవాలతో ప్రజలను ఉర్రూతలూగించారని, బాలనటిగా మర్చిపోలేని నటనను ప్రదర్శించారని ఆదివారం ఒక సందేశంలో కొనియాడారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించి మెప్పించిన శ్రీదేవి.. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’సినిమాలో గృహిణిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి విశేష మన్ననలను అందుకున్నారన్నారు. సినీ ప్రియులకు, సినీ రంగానికి శ్రీదేవి మరణం తీరని లోటన్నారు. శ్రీదేవి మరణంతో దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

శ్రీదేవి లేని లోటు తీర్చలేనిది: ఉత్తమ్, లక్ష్మణ్‌
ప్రముఖ సినీ తార, వందలాది తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన శ్రీదేవి హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. చిత్రపరిశ్రమ ఆమెను కోల్పోవడం దురదృష్టకరమని, ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement