మాజీ సైనికుని కుటుంబం దారుణ హత్యకు గురైంది.
-అహ్మద్‌నగర్‌లో వెలుగుచూసిన ఘటన
సాక్షి, ముంబై: అహ్మద్‌నగర్ జిల్లాలోని శేవ్‌గావ్ తాలూకాలో మాజీ సైనికుని కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఇందులో మాజీ సైనికుడు అప్పాసాహెబ్ హరవణే (50), భార్య సునంద (45), కూతురు స్నేహల్ (21), కుమారుడు మకరంద్ (14) ఉన్నారు.
అప్పాసాహెబ్ ఓ ప్రభుత్వ సంస్థలో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పాలవాడు వచ్చి తలుపు తట్టినప్పటికీ ఎవరు తీయలేదు. దీంతో ఇరుగుపొరుగువారి సాయంతో కిటికీ తలుపులు పగలగొట్టి తొంగి చూడగా కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పదునైన కత్తులతో దాడి చేసి హతమార్చి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కేసును పరిశీలిస్తున్నారు.