పూజలు ఫలించలేదు.. బెయిల్ రాలేదు
అమ్మకు బెయిల్ రావాలి.. ఆమె బయటకు వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి అంటూ తమిళనాట వేలాది మంది మొక్కుకున్నారు. అమ్మకు బెయిల్ రావాలంటూ వందలాది మంది సామూహికంగా ముందుగానే గుళ్లు గీయించుకున్నారు. ఉపవాసాలు ఉన్నారు. ఆ మొక్కులు ఫలించలేదు.. జయలలితకు బెయిల్ రాలేదు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడి సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత జైల్లోకి వెళ్లినప్పటి నుంచి తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో తమిళులు.. ముఖ్యంగా అన్నాడీఎంకే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిరాహార దీక్షలు, మౌన దీక్షలు, ప్రదర్శనలు.. ఇలా అన్ని రకాలుగా ఆమెకు సంఘీభావం తెలియజేస్తూ వచ్చారు.
తమిళ సినీ పరిశ్రమ మొత్తం కొన్ని రోజులు స్తంభించింది. పాఠశాలలు, కళాశాలలు.. ఇలా అన్నిరకాల విద్యాసంస్థలు పనిచేయడం మానేశాయి. చివరకు అభిమానుల నుంచి కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. జయలలితకు బెయిల్ రాకపోయిందో.. తమిళనాడులో ఉన్న కన్నడిగులందరినీ బందీలుగా చేస్తామంటూ పోస్టర్లు కూడా వేశారు. ఎంత చేసినా కర్ణాటక హైకోర్టు జడ్జి మాత్రం ఆమెకు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదనే తేల్చి చెప్పేశారు. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఆమెకు ఇవ్వడానికి తమకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరఫున వాదించిన న్యాయవాదులు చెప్పినా కూడా న్యాయమూర్తి మాత్రం ఆ వాదనలతో ఏకీభవించలేదు.