కన్నీటి పర్యంతమైన మహిళా కలెక్టర్‌! | Farmers Warm Farewell To Selam Collector Rohini Bhajibhakare | Sakshi
Sakshi News home page

రైతుల ప్రేమ; కన్నీటి పర్యంతమైన కలెక్టర్‌

Published Sat, Jun 29 2019 1:22 PM | Last Updated on Sat, Jun 29 2019 1:37 PM

Farmers Warm Farewell To Selam Collector Rohini Bhajibhakare - Sakshi

సాక్షి, చెన్నై : సేలం జిల్లా ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న జిల్లా కలెక్టర్‌ రోహిణీ బాజీ భగారే బదిలీ అయ్యారు. రెండేళ్ల క్రితం తొలి మహిళా కలెక్టర్‌గా సేలంకు వచ్చిన రోహిణీ.. రైతులకు పలు పథకాలను ప్రకటించడంతో పాటుగా ప్రజలకు విశిష్ట సేవలు అందించారు. 2017లో విధులు చేపట్టిన వెంటనే తొలి సమావేశం రైతుల వినతుల స్వీకరణ సమావేశం నిర్వహించారు. అదే విధంగా 20 నెలల పాటు అక్కడ విధులు నిర్వహించిన రోహిణీ రైతులు, దివ్యాంగులు, విద్యార్థులు, మహిళలు, శిశువులు సహా అన్ని వర్గాల వారికి సేవలు అందించి వారి మనస్సులో మంచి స్థానం సంపాదించుకున్నారు. కలెక్టర్‌గా రోహిణీ చేపట్టిన పలు పథకాలు, తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మారుమ్రోగింది. ఈ క్రమంలో గురువారం రాత్రి సేలంతో పాటు నాలుగు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా... శుక్రవారం సేలంలో జరిగిన రైతుల గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో కలెక్టర్‌ రోహిణీ పాల్గొన్నారు. అప్పుడు పలువురు రైతులు రోహిణీకి శాలువలు కప్పి మనసారా అభినందించారు. ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ రోహిణీ మాట్లాడుతూ.. గతంలో తనకు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది శాలువలు కప్పారని, అయితే ఇప్పుడు రైతులు కప్పిన శాలువా తనకెంతో గొప్పగా భావిస్తున్నట్టు తెలిపారు. తన వల్ల వీలైనంత మేరకు రైతులకు సేవ చేశానని ఆమె తెలిపారు. తాను సేలంకు వచ్చినప్పుడు తొలి సమావేశం రైతులదేనని, ఇప్పుడు వెళుతున్న సమయంలో చివరి సమావేశం రైతులదేనని గుర్తు చేసుకున్నారు. కలెక్టరేట్‌లో ఒక వైపు రైతులు, ప్రజలు కలెక్టర్‌ను ప్రశంసలతో ముంచేస్తుంటే, మరో వైపు కన్నీటి పర్యంతమైన కలెక్టర్‌ రోహిణీ రైతులకు వీడ్కోలు పలకడం ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. కాగా, రోహిణీ స్థానంలో వేలూరు జిల్లా కలెక్టర్‌ రామన్‌ సేలంకు బదలి అయ్యారని అధికారులు వెల్లడించారు. అన్నట్లు రోహిణి కూడా రైతుబిడ్డే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement