శ్రీనగర్: ఏడు నెలల నిర్బంధం అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా(82)కు విముక్తి లభించింది. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడూ అయిన ఎంపీ ఫరూక్ అబ్దుల్లాపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(పీఎస్‌ఏ)ను ప్రభుత్వం తొలగించింది. ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం రద్దుచేసిన అనంతరం ఆగస్టు 5వ తేదీన ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 15వ తేదీ నుంచి పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు.
పీఎస్‌ఏ చట్టం ప్రయోగించిన తొలి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాయే. పీఎస్‌ఏ చట్టం కింద నిర్బంధంలో ఉంచినట్టయితే మూడు నెలలపాటు ఎటువంటి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉండదు.అలాగే ఈ నిర్బంధాన్ని 2 ఏళ్ల పాటు కొనసాగించే అవకాశం కూడా చట్టం ఇస్తుంది. శ్రీనగర్‌లోని గప్‌కార్ రోడ్డులోని తన నివాసం నుంచి బయటికి వచ్చిన ఫరూక్ అబ్దుల్లా.. నిర్బంధంలో ఉన్న తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘ఈ రోజు నేను విముక్తిడినయ్యాను. ఈ స్వేచ్ఛ సంపూర్ణం కాదు. ఒమర్, మెహబూబా ముఫ్తీ సహా ఇతర జైళ్ళల్లో నిర్బంధించిన వారందరినీ విముక్తి చేసినప్పుడే అది సంపూర్ణం అవుతుంది’అని మీడియాతో అన్నారు.
‘నా విడుదల కోసం ప్రార్థించిన ప్రతి వ్యక్తికీ కృతజ్ఞతలు. మిగిలిన వారంతా విడుదలయ్యే వరకూ ఏ రాజకీయాలను గురించీ మాట్లాడను. ఇటీవలే కంటికి సంబంధించిన సర్జరీ చేయించుకున్న ఫరూక్ అబ్దుల్లా ప్రజల గొంతుకను వినిపించేందుకు పార్లమెంటు సమావేశాలకు హాజరవుతానన్నారు. ఫరూక్ అబ్దుల్లా విడుదలను స్వాగతించిన నేషనల్ కాన్ఫరెన్స్ నిర్బంధంలో ఉన్న మిగిలిన వారిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment