
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల్లోని అన్ని లేన్లనూ డిసెంబర్ 1 నుంచి ‘ఫాస్టాగ్’ లేన్లుగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత నుంచి ‘ఫాస్టాగ్’ లేని వాహనాలు ఏవైనా ఫాస్టాగ్ లేన్లలోకి వచ్చి, నగదు లేదా ఇతర పద్ధతుల్లో టోల్ ఫీజు చెల్లిస్తే సాధారణం కన్నా వంద శాతం అదనంగా టోల్ ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. డిసెంబర్ 1 తర్వాత కూడా అన్ని టోల్ ప్లాజాల దగ్గరా ఒక్క హైబ్రిడ్ లేన్ మాత్రం ఉంటుందనీ, భారీ వాహనాలు, లేదా సాధారణం కన్నా వేరైన ఆకారంలో ఉన్న వాహనాలను పంపడానికి అవి ఉపయోగపడతాయనీ, ఆ ఒక్క లైన్‌లో మాత్రమే ఫాస్టాగ్‌తోపాటు ఇతర పద్ధతుల్లో టోల్ ఫీజు చెల్లించినా సాధారణ రుసుమే వసూలు చేస్తామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది.
వాహనదారులు టోల్ ఫీజుల కోసం కొంత మొత్తాన్ని ముందుగానే తమ ఫాస్టాగ్ ఖాతాల్లో జమచేసుకోవాల్సి ఉంటుంది. టోల్ గేట్ వద్దకు వాహనం రాగానే, ఫాస్టాగ్ ఆధారంగా ఖాతా నుంచి టోల్ ఫీజు చెల్లింపు దానంతట అదే పూర్తవుతుంది. ఈ పద్ధతిలో వాహనాలు టోల్ గేట్ల వద్ద చాలా స్వల్ప కాలం పాటు మాత్రమే ఆగుతాయి కాబట్టి టోల్ గేట్ల వద్ద ఎక్కువ రద్దీ ఉండదు. నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు ఫాస్టాగ్ లేన్లలోకి రాకూడదు. కానీ ప్రస్తుతం ఈ నిబంధన అమలవ్వక, ఫాస్టాగ్ లేన్లలోనూ వాహనదారులు నగదు లేదా ఇతర పద్ధతుల్లో టోల్ ఫీజు చెల్లిస్తుండటంతో ఫాస్టాగ్ ఉన్న వాహనాలకూ ప్రయాణం ఆలస్యమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment