సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, ది ఇంటర్‌స్టేట్ మైగ్రంట్ వర్కర్ యాక్ట్, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్‌తోపాటు వేతనాలకు సంబంధించిన అన్ని చట్టాలు కూడా వలస కూలీలకు సకాలంలో జీతాలు చెల్లించాలని సూచిస్తున్నాయి. లాక్‌డౌన్ సందర్భంగా మూత పడిన అనేక కంపెనీలు, దుకాణాలు కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా వలస కార్మికులు సొంతూర్లకు పయనమయ్యారు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో వారు చిక్కుకు పోయారు. కొంత మంది ధైర్యం చేసి ద్విచక్ర వాహనాలపైనో, కాలినడకనో ఊర్లకు బయల్దేరిన వాళ్లను సరిహద్దుల్లో నిలిపేశారు.
దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికుల్లో కేవలం ఆరు లక్షల మందికి వసతి కల్పించినట్లు, దాదాపు 22 లక్షల మందికి ఆహారం అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటవ తేదీన సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ‘స్వాన్’ నిర్వహించిన సర్వే ప్రకారం 84 శాతం వలస కార్మికులకు యాజమాన్యం వేతనాలు చెల్లించలేదు. వారిలో 98 శాతం మంది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేదు. 70 శాతం మందికి రేషన్ అందలేదు. 50 శాతం మందికి తినడానికి తిండి, చేతిలో చిల్లి గవ్వా లేదు.
‘స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్‌వర్క్’ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 9వ తేదీ వరకు 11 వేల మంది వలస కార్మికులను విచారించగా లాక్‌డౌన్ కారణంగా 189 మంది వలస కార్మికులు మరణించారు. వీరిలో ప్రయాణంలో ప్రాణం విడిచిన వారు, ఆకలితో మరణించినవారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసే నాటికి ఎన్ని వేల మంది వలస కార్మికులు మరణిస్తారో తెలియదు. వలస కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అని కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు గంటల ముందు ప్రకటించడం ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2011 సెన్సెస్ ప్రకారమే దేశవ్యాప్తంగా 5.6 కోట్ల మంది వలసకార్మికులు ఉన్నారు. వారిలో నాలుగు కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం వలస కార్మికుల్లో 3.40 కోట్ల మంది అనియత రంగాల్లో దినసరి వేతనం మీద పని చేస్తున్న వారే. ఈ వివరాలు ప్రభుత్వం వెబ్‌సైట్లలోనే ఉన్నాయి. లాక్‌డౌన్ ప్రకటిస్తే వలస కార్మికులు సొంతూళ్లకు వెళతారని భావించి ఉండక పోవచ్చని అనడానికి వీల్లేదు. 1994లో ప్లేగ్ వ్యాపించినప్పుడుచ 2005లో వరదలు సంభవించినప్పుడు ముంబై నుంచి లక్షల మంది వలస కార్మికులు సొంతూళ్లకు బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment