
ఫాతిమా.. (ఫైల్)తండ్రికి పంపిన సమాచారం
సాక్షి, చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా మృతి కేసులో ప్రొఫెసర్ల మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి లతీఫ్‌కు ఫాతిమా పంపిన సమాచారాన్ని పరిశోధకులు ధ్రువీకరించారు. అలాగే తన కుమార్తె మరణంలో సహచర విద్యార్థుల ప్రమేయం కూడా ఉన్నట్టు లతీఫ్ ఆరోపణలు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరారు.మద్రాసు ఐఐటీలో చదువుకుంటున్న కేరళకు చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం వెనుక వేధింపులు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులు తాళలేక ఫాతిమా బలవన్మరణానికి పాల్పడినట్టుగా సంకేతాలు రావడంతో విద్యార్థుల్లో ఆగ్రహంతో ఉన్నారు. అలాగే వేధింపుల సమాచారం మెయిల్‌ను చెన్నై పోలీసుల దృష్టికి ఫాతిమా తండ్రి లతీఫ్ తీసుకురావడంతో ప్రొఫెసర్ల చుట్టూ విచారణ సాగింది. న్యాయం కోసం సీఎం పళనిస్వామిని సైతం ఫాతిమా కుటుంబం కలిసి విజ్ఞప్తి చేసుకుంది. అయితే కేసును పక్కదారి పట్టించే రీతిలో విచారణ సాగుతున్నట్టు, ప్రొఫెసర్లను రక్షించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో ఇక ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించే పనిలో లతీఫ్ నిమగ్నమయ్యారు.
సహచర విద్యార్థులపై ఆరోపణలు..
తన కుమార్తె మరణానికి న్యాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు లతీఫ్ ఢిల్లీ వెళ్లారు. వెళ్తూ తిరువనంతపురం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె వేధింపుల్లో ప్రొఫెసర్లతో పాటుగా సహచర విద్యార్థులు కూడా కొందరు ఉన్నట్టుగా తెలుస్తోందని, అందుకు తగ్గ ఆధారాలను సేకరించి ఉన్నట్టు వివరించారు. వీటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరుతామన్నారు. అప్పటికీ తమకు న్యాయం లభించకుంటే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా లతీఫ్ సమర్పించిన సమాచారం, మెయిల్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలోని వివరాలను పరిశోధకులు పరిశీలించి నిర్ధారించి ఉన్నారు. అవన్నీ ఫాతిమా పంపినట్టుగా పరిశోధనలో తేలి ఉన్నట్టు, ఇందుకు తగ్గ నివేదిక కోర్టుకు చేరి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే సెంట్రల్ క్రైం బ్రాంచ్ అస్టిసెంట్ కమిషనర్ మూర్తి, సహాయ కమిషనర్ మెక్లినా నేతృత్వంలోని బృందం ఈ సంకేతాల్ని ధ్రువీకరించడం లేదు. ఇదిలా ఉండా ఐఐటీలో వరసుగా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల్ని సీబై చేత విచారించాలని, కోర్టులో దాఖలైన పిటిషన్ వాదనలు ముగిశాయి. అయితే, తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.