నాకు ఏడుపు వస్తోంది: సీఎం
గంగా నది పరిస్థితిని చూస్తుంటే తనకు ఏడుపు వస్తోందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వచ్చిన తర్వాత ఆయనీ వ్యాఖ్య చేశారు. గడిచిన మూడు రోజుల్లో గంగానది వరదల కారణంగా బిహార్‌లో 22 మంది మరణించగా, 22 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నిజానికి రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే 14% తక్కువ వర్షపాతం నమోదైందని.. మానవ తప్పిదం వల్లే ఈ విలయం సంభవించిందని నితీష్ అన్నారు.
నేపాల్‌తో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా బిహార్‌లో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మొత్తం 39 జిల్లాల్లో సగానికి పైగా వరదల్లో మునిగిపోయాయి. తొలిసారిగా భోజ్‌పూర్, వైశాలి, పట్నా ప్రాంతాల్లో కూడా వరద వచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని ఫరాకా బ్యారేజి కారణంగానే ఈ వరదలు వచ్చాయని ప్రధానికి నితీష్ తెలిపారు.
ఆ బ్యారేజి నిర్మాణం కారణంగా నదిలో భారీగా పూడిక పేరుకుపోయిందని, అసలు దాని అవసరం ఉందో లేదో మళ్లీ సమీక్షించాలని అన్నారు. అక్కడి పూడిక కారణంగానే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నాకు కూడా మట్టి, వరదనీరు కొట్టుకొస్తున్నట్లు తమ నిపుణులు చెప్పారన్నారు. బ్యారేజిని తొలగిస్తే పూడిక మొత్తం బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలోకి వెళ్లిపోతుందని చెప్పారు. పట్నా చుట్టుపక్కల ప్రాంతాల్లో పూడిక తొలగింపు కోసం వెంటనే నిపుణుల బృందాన్ని పంపుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.