river ganga floods
-
అక్కడ శవాలు వెయిటింగ్!
కాశీకి వెళ్లి చనిపోవడం, అక్కడే అంత్యక్రియలు జరిపించుకోవడం చాలా అదృష్టం అంటారు. కానీ, అలాంటిది ఇప్పుడు అక్కడ అంత్యక్రియల కోసం శవాలు వెయిటింగ్ లిస్టులో వేచి చూడాల్సి వస్తోంది. అంత్యక్రియలకు పేరొందిన మణికర్ణికా ఘాట్‌తో పాటు దానికి దారితీసే వీధులన్నీ కూడా భారీ వరదలతో జలమయం అయ్యాయి. దాంతో ఎత్తుగా ఉన్న ప్లాట్‌ఫారాల మీద మాత్రమే శవ దహనాలు జరుగుతున్నాయి. అక్కడి వరకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు బోట్లను అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఇక్కడకు 75-100 మృతదేహాలు వస్తుంటాయని, కానీ ఇక్కడ ఒకసారి ఆరింటిని మాత్రమే దహనం చేయగలమని అక్కడి కాటికాపరి చెప్పారు. దాంతో మృతదేహాలను షిఫ్టులలో దహనం చేయాల్సి వస్తోందన్నారు. ఒక్కో శవం పూర్తిగా కాలడానికి కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుందని, అందువల్ల మిగిలిన శవాలఉ వెయిటింగ్ లిస్టులో ఉంచక తప్పడం లేదని తెలిపారు. తాము గంట నుంచి ప్లాట్‌ఫాం వద్దే వేచి ఉన్నామని, తమ వంతు వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని తమ బంధువు శవాన్ని తీసుకుని వచ్చిన ప్రేమ్‌చంద్ శ్రీవాత్సవ అనే వ్యక్తి చెప్పారు. వరదలు ఎక్కువగా ఉండటంతో మృతుల బంధువులు కూర్చోడానికి కూడా స్థలం దొరకట్లేదట. శవాలను కాల్చడానికి ఉపయోగించే కట్టెల నుంచి మొత్తం అన్ని సామాన్ల రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్లాట్‌ఫాం వరకు మృతదేహాలను తీసుకురావడానికి పడవల వాళ్లు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. కట్టెల వ్యాపారులు కూడా గడ్డుకాలమే ఎదుర్కొంటున్నారు. ప్లాట్‌ఫారాల వరకు కట్టెలు తీసుకెళ్లడానికి బోట్లు కూడా ఉండట్లేదు. దానికి తోడు.. చాలావరకు కట్టెలు వరద నీటితో తడిసిపోయాయి. దాంతో తమ కడుపు నింపుకోవడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు. -
నాకు ఏడుపు వస్తోంది: సీఎం
గంగా నది పరిస్థితిని చూస్తుంటే తనకు ఏడుపు వస్తోందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వచ్చిన తర్వాత ఆయనీ వ్యాఖ్య చేశారు. గడిచిన మూడు రోజుల్లో గంగానది వరదల కారణంగా బిహార్‌లో 22 మంది మరణించగా, 22 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నిజానికి రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే 14% తక్కువ వర్షపాతం నమోదైందని.. మానవ తప్పిదం వల్లే ఈ విలయం సంభవించిందని నితీష్ అన్నారు. నేపాల్‌తో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా బిహార్‌లో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మొత్తం 39 జిల్లాల్లో సగానికి పైగా వరదల్లో మునిగిపోయాయి. తొలిసారిగా భోజ్‌పూర్, వైశాలి, పట్నా ప్రాంతాల్లో కూడా వరద వచ్చింది. పశ్చిమబెంగాల్లోని ఫరాకా బ్యారేజి కారణంగానే ఈ వరదలు వచ్చాయని ప్రధానికి నితీష్ తెలిపారు. ఆ బ్యారేజి నిర్మాణం కారణంగా నదిలో భారీగా పూడిక పేరుకుపోయిందని, అసలు దాని అవసరం ఉందో లేదో మళ్లీ సమీక్షించాలని అన్నారు. అక్కడి పూడిక కారణంగానే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నాకు కూడా మట్టి, వరదనీరు కొట్టుకొస్తున్నట్లు తమ నిపుణులు చెప్పారన్నారు. బ్యారేజిని తొలగిస్తే పూడిక మొత్తం బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలోకి వెళ్లిపోతుందని చెప్పారు. పట్నా చుట్టుపక్కల ప్రాంతాల్లో పూడిక తొలగింపు కోసం వెంటనే నిపుణుల బృందాన్ని పంపుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.