
పాపం సోనియానా.. కోర్టుకా!
ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులలో మొదటి వరుసలో ఉండే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి.. ఉన్నట్టుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే ఎల్లమాలిన ప్రేమ, జాలి వచ్చేశాయి.
ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులలో మొదటి వరుసలో ఉండే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి.. ఉన్నట్టుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే ఎల్లమాలిన ప్రేమ, జాలి వచ్చేశాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన కేసులో తప్పనిసరిగా సోనియా, రాహుల్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పడంతో వాళ్లు తొలిసారి కోర్టు గుమ్మం తొక్కాల్సి వస్తోంది. దాదాపుగా దేశానికి ప్రధానమంత్రి కాబోయి.. కొద్దిలో తప్పిపోయినా.. వెనక నుంచి చక్రం తిప్పిన సోనియాగాంధీకి ఎంతటి కష్టం వచ్చిందని మమతా బెనర్జీ తెగ బాధపడిపోయారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తాను కలుస్తానని, సోనియాగాంధీకి కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతానని అన్నారు.
అయితే.. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పొత్తుపెట్టుకుంటుందో.. అలా జరిగితే ఓట్లు చీలిపోయి తమకు నష్టం కలుగుతుందోనని మమతమ్మ భయపడుతున్నారన్నది విశ్వసనీయ సమాచారం. అందుకే ఎందుకైనా మంచిదని ముందుగానే సోనియమ్మను ప్రసన్నం చేసుకోడానికే ఇలా జాలి ఒలకబోశారా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.