
దండిగా వ్యవ'సాయం'
రైతులకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వరాలు
అన్నదాతా... ఐదేళ్లాగాలా?
ఏదైనా ఓకే! తిండిని డౌన్‌లోడ్ చెయ్యలేం కదా!! దాన్ని రైతు పండించాల్సిందే!! ఇది తెలిసే రైతు వాలెట్లో రెట్టింపు ఆదాయం వేస్తానన్నారు జైట్లీ. దానికి ఐదేళ్ళు కావాలన్నారు. మరి తొలి ఏడాదేం చేశారు? రుణాల లక్ష్యం 9 నుంచి 10 లక్షల కోట్లకు పెంచారు. కానీ ఇవ్వాల్సింది బ్యాంకులు కదా? సహకార సంఘాల నుంచి తీసుకునే రుణాలకు 60 రోజుల వడ్డీ రాయితీని అధికారికం చేశారు. ఇది ఏమాత్రం సరిపోతుందన్నది ప్రశ్నే. పంటల బీమా కింద కవరేజీ పెంచినా... బీమా సొమ్ము సకాలంలో అందుతుందా? భూసార పరీక్షలకు మినీ ల్యాబ్‌లు, సాగు నిధి, మైక్రో ఇరిగేషన్ నిధి... ఇవన్నీ అంది రైతు లాభపడాలంటే ఐదేళ్లు ఆగాల్సిందేనా?
దేశంలోని రైతులు: 1 1.88 కోట్లు
(రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 లెక్కల ప్రకారం)
రైతులకు రూ.10 లక్షల కోట్ల రుణాలు
వ్యవసాయం,అనుబంధ రంగాలకు రూ.58,663 కోట్లు
ప్రధాని పంటల బీమా పథకానికి రూ.9 వేల కోట్లు
సూక్ష్మ సేద్యానికి రూ.5,000 కోట్లు
ఐదేళ్లలో అన్నదాతల ఆదాయం రెట్టింపు
వ్యవసాయ రంగం వృద్ధిరేటు 4.1 శాతంగా అంచనా
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, అందుకు 2017–18లో అన్నదాతలకు రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2016–17 బడ్జెట్‌తో పోలిస్తే వ్యవసాయ రుణాలను రూ.లక్ష కోట్ల మేర పెంచినట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను వ్యవసాయ, అనుబంధ రంగాలకు మొత్తంగా రూ.58,663 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. 2016–17లో ఇది రూ.52,821 కోట్లుగా ఉంది. వ్యవసాయ రుణాల్లో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక చర్యలు చేపడతామని జైట్లీ పేర్కొన్నారు. ఈసారి విస్తారంగా వర్షాలు కురవడంతో దేశంలో వ్యవసాయం పరిస్థితి ఆశాజనకంగానే ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వృద్ధిరేటు 4.1 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఖరీఫ్, రబీలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు.
సాగుకు ఇంకేం ఇచ్చారంటే..
► కిందటేడాది ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించారు. 2016–17లో ఈ పథకానికి రూ.13,240 కోట్లు కేటాయించడం గమనార్హం. పథకం పరిధిలోకి 2016–17లో 40% పంట భూములను, 2017–18కల్లా 50 శాతం పంట భూములను తెస్తామని జైట్లీ ప్రకటించారు
► రైతులకు సబ్సిడీ వడ్డీపై అందించే స్వల్పకాలిక రుణాలకు రూ.15 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు
► సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డులో రూ.5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు. నాబార్డులో ఇప్పటికే ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక ఇరిగేషన్ ఫండ్ 20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంపు
► పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని జైట్లీ చెప్పారు. డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు వచ్చే మూడేళ్లకుగాను రూ.8 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
► చిన్న, సన్నకారు రైతులు తేలిగ్గా రుణాలు పొందేందుకు వీలుగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)ను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ)కోర్ బ్యాకింగ్ వ్యవస్థతో అను సంధానిస్తామని జైట్లీ తెలిపారు. ఇందుకు మూడేళ్లలో రూ.1,900 కోట్లు వెచ్చించనున్నారు
► ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) వ్యవస్థ ప్రస్తుతం 250 మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీన్ని 585 మార్కెట్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జైట్లీ చెప్పారు. వీటిల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్కో మార్కెట్‌కు రూ.75 లక్షల సాయం అందజేస్తామన్నారు.
► భూసార పరీక్షల కోసం దేశంలోని 648 కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో మినీ ల్యాబ్‌ల ఏర్పాటు. వీటికి అదనంగా.. స్థానికంగా ఉండే నిపుణులతో మరో వెయ్యి మినీ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు
► పళ్లు, కూరగాయల సాగులో ‘కాంట్రాక్ట్ వ్యవసాయం’పై నమూ నా చట్టం తెస్తామని చెప్పారు. దీనిపై రాష్ట్రాల అభిప్రాయం కోరతామన్నారు
► ధరల స్థిరీకరణ నిధి(పీఎస్‌ఎఫ్)కి రూ.3,500 కోట్లు
► పంటలకు గిట్టుబాటు ధర దక్కని సమయంలో మార్కెట్ ధరల్లో జోక్యం చేసుకునేందుకు ఉద్దేశించిన పథకానికి రూ.200 కోట్లు
► విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి దేశీయ ఆహార పరిశ్రమను కాపాడేందుకు.. జీడిపప్పు(రోస్టెడ్ అండ్ సాల్ట్) దిగుమతిపై 30 శాతం ఉన్న కస్టమ్ డ్యూటీని 45 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు
గ్రామీణం, వ్యవసాయ రంగంపై బడ్జెట్‌లో ఫోకస్ పెరిగింది. ఇది మంచి పరిణామం. డిజిటైజేషన్, కొత్త సంస్కరణలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ లక్ష్యాన్ని సాధించేందుకు సూక్ష్మ సేద్యానికి రూ.5 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించారు. మరింత భూమిని సాగుకు యోగ్యంగా మలిచేందుకు ఇది తోడ్పడుతుంది.
– హర్ష కుమార్ భన్వాలా, నాబార్డ్ చైర్మన్
బడ్జెట్
స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయపట్టిక. సర్కారు ఆర్థిక, విధాన పత్రం. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతున్నారో వివరించే కార్యాచరణ ప్రణాళిక.
మూలధన బడ్జెట్
మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి.
క్యాపిటల్ పద్దు (ప్రణాళికా వ్యయం)
ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఇందులో ఉంటాయి.
రెవెన్యూ పద్దు (ప్రణాళికేతర వ్యయం)
ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికలు, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటకం, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ఈ పద్దులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.
సంచిత నిధి
అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు–రెవెన్యూ వ్యయం. 2. మూలధన వసూళ్లు–మూలధన వ్యయం.
ప్రభుత్వ ఖాతా
సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.
రెవెన్యూ వసూళ్లు
పన్నులు, సుంకాల ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూళ్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు (కస్టమ్స్), ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే సొమ్మంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూ లు చేసే చార్జీలు వీటి కిందకే వస్తాయి.
రెవెన్యూ వ్యయం
ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించదు.
రెవెన్యూ లోటు (REVENUE DEFICIT) రెవెన్యూ వసూళ్లు, వ్యయానికి మధ్య తేడా.
ప్రత్యక్ష పన్నులు
ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెని ఫిట్ ట్యాక్స్ మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి.
పరోక్ష పన్నులు (REVENUE DEFICIT): మనం చేసే వ్యయాలపై పరోక్షంగా విధించే పన్ను. కస్టమ్స్,ఎక్సైజ్, సర్వీస్ టాక్స్‌లన్నీ దీని పరిధిలోకే వస్తాయి.
స్వల్పంగా పెరిగిన సీబీఐ బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 695.62 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 8.31 శాతం పెంచింది. గత బడ్జెట్‌లో రూ. 727.75 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో దానిని రూ. 642.24 కోట్లకు తగ్గించింది. ఈ మొత్తానికి మరో రూ. 53.38 కోట్లు ఎక్కువగా ఈసారి బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ కేటాయించారు.