దయనీయం.. పల్లె భారతం | Finance Minister Arun Jaitley releases Socio-Economic and Caste Census | Sakshi
Sakshi News home page

దయనీయం.. పల్లె భారతం

Published Sat, Jul 4 2015 1:23 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

దయనీయం.. పల్లె భారతం - Sakshi

దయనీయం.. పల్లె భారతం

మూడింట ఒకవంతు గ్రామీణ కుటుంబాలకు సాగుభూమి లేదు
సగానికి పైగా కుటుంబాలకు కూలిపనే జీవనాధారం    

మూడింట ఒక వంతు నిరక్షరాస్యులే
75% కుటుంబాల్లోని అత్యధిక సంపాదన పరుడి ఆదాయం ఐదువేలే
2011 జనగణనలో వెల్లడైన వాస్తవాలు
ఈ వివరాలను ప్రభుత్వ పథకాల అమలుకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం
కులగణన వివరాలను వెల్లడించని వైనం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ‘2011 సామాజిక, ఆర్థిక , కుల జనగణన(ఎస్‌ఈసీసీ)’ వివరాలు గ్రామీణ భారత దయనీయ ముఖచిత్రాన్ని కళ్లకు గట్టాయి. గ్రామాల్లోని ప్రతీ మూడు కుటుంబాల్లో ఒకటి కూలి పనిని జీవనోపాధిగా చేసుకున్న సాగుభూమి లేని నిరుపేద కుటుంబమేనని ఎస్‌ఈసీసీలో తేలింది. 23.52% గ్రామీణ కుటుంబాల్లో చదువుకున్న పెద్దలెవరూ(25 ఏళ్లు పైబడినవారు) లేరని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన జనగణన-2011 వివరాలను శుక్రవారం ఆ శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్‌తో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు.

ఈ సెన్సస్‌లో వివరాల నమోదుకు పేపర్‌ను ఉపయోగించకపోవడం విశేషం. చేతిలో ఇమిడే 6.4 లక్షల ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో పౌరుల వివరాలను నమోదు చేశారు. 1932 తరువాత కులాల వారీగా వివరాలను నమోదు చేసిన సెన్సస్ ఇదేనని జైట్లీ పేర్కొన్నారు. అయితే, ఈ సెన్సస్‌లో సామాజిక, ఆర్థికాంశాలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో విధాన రూపకర్తలకు ఈ నివేదిక అత్యంత విలువైనదన్నారు. ‘ఈ నివేదికలో ప్రాంతం, వర్గం, కులం, ఆర్థిక స్థితి.. మొదలైన విభాగాల వారీగా గణాంకాలున్నాయి. ఏ ప్రాంతం, ఏ సామాజిక వర్గం ప్రజలు ఆర్థికంగా, జీవన ప్రమాణాల పరంగా ఉన్నత స్థాయికి వెళ్లారనే వివరాలున్నాయి.

వీటి ద్వారా భవిష్యత్ ప్రణాళిక లక్ష్యాలను నిర్ధారించుకోవచ్చు’ అని జైట్లీ వివరించారు. వీటి ద్వారా గ్రామ పంచాయతీని యూనిట్‌గా తీసుకుని పేదరిక నిర్మూలనకు శాస్త్రీయంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని బీరేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల వాస్తవ లబ్ధిదారుల ఎంపికకు ఇవి ఉపయోగపడ్తాయన్నారు. ఈ నివేదిక పేరు(ఎసీఈసీసీ)లో కుల గణన అని ఉన్నప్పటికీ.. ఆ గణాంకాలను వెల్లడించడం లేదన్నారు.  ఎస్‌ఈసీసీ గణాంకాలు అందరికీ ఇళ్లు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి హామీ తదితర పథకాల్లో ఉపయోగపడ్తాయన్నారు. పేదరికాన్ని నిర్ధారించే ‘బీపీఎల్’ విధానం ఆధారంగా కాకుండా ఈ గణాంకాల ఆధారంగానే  పథకాల అమలు ఉంటుందన్నారు.
 
30 శాతం గ్రామీణ కుటుంబాలు ఎస్సీ, ఎస్టీలే
గ్రామీణ కుటుంబాల్లో 29.43% షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవేనని తాజా ఎస్‌ఈసీసీ గణాంకాల్లో తేలింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఎస్సీ జనాభా పంజాబ్‌లో అత్యధికంగా(36.74%) ఉండగా, తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్(28.45%), తమిళనాడు(25.55%) ఉన్నాయి. ఎస్టీల జనాభా మిజోరంలో అత్యధికంగా(98.79%) ఉండగా, లక్షద్వీప్(96.59%), నాగాలాండ్(93.91%)  తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల సగటు దేశవ్యాప్తంగా 18.46%, 10.97%.
 
నిరక్షరాస్యతలో 4వ స్థానంలో తెలంగాణ
మూడింట ఒక వంతు పల్లె  దేశీయులు నిరక్షరాస్యలు.  వారిలో అక్షరాస్యత శాతం  64%. వీరు  అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్(47.58%), మధ్యప్రదేశ్(44.19%) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 40.42%  పల్లె నిరక్షరాస్యులతో 4వ స్థానంలో ఉంది. కేరళ 11.38% నిరక్షరాస్యులతో ఆఖర్న ఉంది.  
 
ఎస్‌ఈసీసీ - 2011 ముఖ్యాంశాలు..
దేశంలో మొత్త 24.39 కోట్ల కుటుంబాలున్నాయి. పల్లెల్లోని  కుటుంబాలు 17.91 కోట్లు. ఈ పల్లె కుటుంబాల్లో 10.69 కోట్లు నిరుపేద కుటుంబాలు.
2.37 కోట్ల(13.25%) గ్రామీణ కుటుంబాలు కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న ఒకే ఒక్క గదిలో నివసిస్తున్నాయి.
51.14% పల్లె కుటుంబాలు(9.16కోట్లు) కూలిపనిపై, 30.10% కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. 14.01%(2.5 కోట్లు)  ప్రభుత్వ, ప్రైవేట్ కొలువుల్లాంటి వాటిపై ఆధారపడి ఉన్నాయి.
4.08 లక్షల మంది చెత్త ఏరుకోవడం ద్వారా, 6.68 లక్షల మంది భిక్షాటన,  ఎన్జీవోల సాయం ద్వారా జీవనం గడుపుతున్నారు.
గ్రామాల్లో మాన్యువల్ స్కావెంజర్స్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర(2.5%)తొలి స్థానంలో ఉంది. ఈ విషయంలో దేశ సగటు 0.10%(18.06 లక్షలు)గా ఉంది. గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మణిపూర్, అస్సాం తదితర 9 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థను నిర్మూలించాయి.
పల్లెల్లో ఎక్కువ మొత్తం సంపాదించే కుటుంబ సభ్యుడి సంపాదన నెలకు సగటున రూ.5 వేల లోపే ఉన్న కుటుంబాలు74.49%(13.34 కోట్ల కుటుంబాలు). 1.48 కోట్ల కుటుంబాల్లోని (8.29%) అత్యధిక సంపాదనాపరుడైన వ్యక్తి నెలవారీ సంపాదన మాత్రం రూ. 10 వేలుగా ఉంది.
గ్రామాల్లో నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగస్తుల కుటుంబాలు 9.68%. ఈ కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లిస్తోంది 4.6%
 
కులాలవారీ వివరాలు లేవు
కులాధారిత గణాంకాలను ఈ నివేదికలో ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన సామాజిక, ఆర్థిక వివరాలకే ప్రాధాన్యమిచ్చామని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్లనే కులాలవారీ వివరాలను వెల్లడించడం లేదన్న విమర్శలపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ స్పందిస్తూ.. దీనికి, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఏయే వివరాలను వెల్లడించాలన్నది సెన్సస్ డీజీ పరిధిలోని అంశమన్నారు. 2011లో ఈ జనగణన ప్రక్రియ ప్రారంభమైన సమయంలో.. కులాలవారీ గణన చేపట్టాలన్న డిమాండ్ భారీగా వచ్చింది. ఎస్పీ నేత ములాయం, ఆర్జేడీ చీఫ్ లాలూ తదితరులు గట్టిగా పట్టుపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement